మధిర, నవంబర్ 11 : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదినేని రమేశ్, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరకాయల జంగారెడ్డి రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డికి హైదరాబాద్లో మంగళవారం వినతి పత్రం అందజేశారు. సామినేని రామారావును అక్టోబర్ 31వ తేదీన పాతర్లపాడు గ్రామంలో ఉదయం 5:30 గంటల సమయంలో అతి కిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ ఘటన జరిగి 12 రోజులు అవుతున్నా నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు.
పాతర్లపాడు గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కండ్రా పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ కక్షలతోనే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుట్రపన్ని హత్య చేశారని ఆరోపించారు. హంతకులను తాను స్వయంగా చూశానని వారి పేర్లతో సహా రామారావు భార్య స్వరాజ్యం పోలీసులకు పిటిషన్ ఇచ్చినా ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం బాధాకరమన్నారు. ఈ హత్యకు కారణమైన వారందరినీ అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.