IAS couple : వాళ్లిద్దరూ ఐఏఎస్ అధికారులు (IAS offficers). ఉన్నత విద్యావంతులు. సమాజం పోకడపై మంచి అవగాహన ఉన్నవాళ్లు. మంచి చెడుల గురించి బాగా తెలిసినవాళ్లు. ఆ ఇద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. అలాంటి జంట ఎంతో పరిణతితో కాపురం చేస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆ జంట మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంది. పెళ్లైన కొన్ని రోజులకే గొడవలు మొదలయ్యాయి. చివరికి ఆ గొడవలు భర్తపై భార్య గృహహింస (Domestic violence) కేసు పెట్టేదాకా వెళ్లాయి.
ఐఏఎస్ అధికారి అయిన తన భర్త ఆశీష్ మోదీ (Ashish Modi) తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఐఏఎస్ అధికారి అయన భార్య భారతీ దీక్షిత్ (Bharati Dexit) పోలీసులకు ఫిర్యాదు చేశారు. గృహహింస చట్టం కింద ఆయనపై కేసు పెట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న భారతి దీక్షిత్ భర్త వేధిస్తున్నాడంటూ జైపూర్ పోలీసులను ఆశ్రయించారు.
సామాజిక న్యాయం, సాధికారత విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తన భర్త.. వివాహం జరిగినప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, ఈ మధ్య వేధింపులు తీవ్రమయ్యాయని భారతి దీక్షిత్ ఆరోపించారు. అత్తింటివారి నుంచి తన ప్రాణాలకు హాని ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తామిద్దరం 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారులమని, అదే ఏడాది వివాహం జరిగిందని, అప్పటి నుంచి ఆశిష్ మోదీ తరచూ మద్యం సేవించి తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని ఆరోపించారు.
ఆశీష్ మోదీకి పలువురు నేరస్థులతోనూ సంబంధాలున్నాయని తెలిపారు. ఈ మధ్య కాలంలో వేధింపులు మరీ ఎక్కువయ్యాయని, గత నెలలో ఆశిష్ అతడి స్నేహితులతో కలిసి తనను ఓ ప్రభుత్వ వాహనంలో అపహరించి, చాలా గంటలపాటు నిర్బంధంలో ఉంచారని పేర్కొన్నారు. విడాకులకు అంగీకరించకపోతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టారు.