ఇప్పుడు సినీ నిర్మాణం అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. కొత్త ఆర్టిస్టులతో ఓ చిన్న సినిమా తీయాలన్నా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సిందే. అలాంటిది కేవలం 33 వేలతో సినిమా తీసి చూపించారు బాలీవుడ్ దర్శకుడు రాహి అనిల్ బార్వీ. ఈ బడ్జెట్తో షార్ట్ఫిల్మ్ తీయడం కష్టతరమైన నేటి పరిస్థితుల్లో ఆయన ఏకంగా ఫీచర్ ఫిల్మ్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాహి అనిల్ బార్వీ ఎవరో కాదు..‘తుంబాడ్’ వంటి మిస్టరీ థ్రిల్లర్తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన.
ఇప్పుడు ‘మన్-పిశాచ్’ పేరుతో కేవలం ఇద్దరు నటులతో ఆయన ప్రయోగం చేశారు. ఈ సైకలాజికల్ హారర్ డ్రామాను యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే అనే ఇద్దరు నటులతో 80 నిమిషాల నిడివితో తెరకెక్కించారు. ‘మన్-పిశాచ్’ స్క్రిప్ట్ 60 పేజీలు. ఈ సినిమా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు. చేతితో గీసిన స్టోరీ బోర్డులు, ఐఫోన్లో తీసిన వీడియో రికార్డింగ్స్, ఫొటోషాప్, జనరేటివ్ ఏఐ ఉపయోగించిన ఈ సినిమాను పూర్తి చేశారు.
పురావస్తు శాఖకు చెందిన అధికారి సదాశివరావ్..హడమ్గాన్ అనే ఒక ఊరికి వెళతాడు. కొండలోంచి బయటపడ్డ పెద్ద గుమ్మటం రహస్యం తెలుసుకునేందుకు పరిశోధన మొదలుపెడతాడు. అక్కడ సావిత్రి అనే వితంతువు ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. రాత్రి కాగానే ఆ గ్రామంలో చోటుచేసుకునే భయానక అనుభవాలే ‘మన్-పిశాచ్’ కథ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కేవలం 33 వేలతో ఆ స్థాయి క్వాలిటీతో సినిమా తీయడం అద్భుతమని ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో కృతిమ మేధ (ఏఐ) సినిమా నిర్మాణాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెబుతున్నారు. పట్టుదల, తపన ఉంటే ఓ కళాకారుడు శూన్యం నుంచి కూడా అద్భుతాలు సృష్టించగలడని, అందుకు ఈ సినిమా ప్రయోగమే సాక్ష్యమని దర్శకుడు అనిల్ బార్వీ తెలిపారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్లో విడుదల చేయబోతున్నారు.