ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో సాగవుతున్న పంటల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభంకాలేదు. 5.91 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వ్యవసాయశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించడంతో పంటల వివరాలు తెలుస్తాయి. అసలైన రైతులు మాత్రమే పంట ఉత్పత్తులను ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతో విక్రయించుకొనే అవకాశం ఉంటుంది. వర్షాలు అనుకూలించడంతో పంటలు బాగా పెరుగుతున్నాయి.
– ఆదిలాబాద్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ)
క్రాప్ బుకింగ్‌లో జాప్యం
రైతులు పంటలను ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే వ్యవసాయశాఖ అధికారులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. గ్రామాల్లో పర్యటించి రైతులు ఏఏ పంటలు, ఎంత విస్తీర్ణంలో వేశారనే విషయాలు సేకరించి లోకేషన్తోపాటు పంటల ఫొటోలను అప్లోడ్ చేయాలి. వీటి ఆధారంగా దిగుబడులను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు అంచనా వేసి కొనుగోళ్లకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. క్రాప్ బుకింగ్‌లో భాగంగా పంటల వివరాలు నమోదు చేసుకొన్న రైతులు మాత్రమే తమ పత్తి, సోయాబిన్, కంది, మక్క పంటలను ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో మద్దతు ధరతో అమ్ముకొనే అవకాశం ఉంది.
మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్, సీసీఐ కేంద్రాలకు రైతులు పంటలను అమ్మకానికి తీసుకొచ్చినప్పుడు మార్కెటింగ్ సిబ్బంది ఆన్లైన్లో పొందుపర్చిన వివరాలు ఉంటేనే కొనుగోళ్లు జరుపుతారు. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచిన వ్యవసాయశాఖ అధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించలేదు. గతేడాది ఆన్లైన్లో పంటల వివరాల నమోదు కార్యక్రమం జాప్యం కారణంగా పత్తి, ఇతర పంటల కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఆలస్యంగా ఈ ప్రక్రియ ప్రారంభమైతే వివరాల నమోదులో కచ్చితత్వం ఉండకపోవడం వంటివి జరగవచ్చు. దీంతో అసలైన రైతులకు తమ పంటను మద్దతు ధరతో విక్రయించుకొనే అవకాశం ఉండకపోవడంతోపాటు దళారులకు అవకాశం కలుగుతుంది.

ఆలస్యం కారణంగా రైతులకు నష్టం
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం పంట ల వివరాల నమోదు ప్రక్రియలో జాప్యం కారణంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయశాఖ అధికారులు క్రాప్ బుకింగ్లోను పారదర్శకంగా చేపట్టాలి. రైతు ల చేతికి పంటలు వచ్చినాటికి ఈ పక్రియను పూర్తి చేసి, సరైన సమయంలో పంటలను ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతో విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలి. చివరి సమయంలో హడావుడిగా నమోదు చేయడంతో ఆన్లైన్లో వివరాలు లేక రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. గతేడాది క్రాప్ బుకింగ్ ఆలస్యమవడంతో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యం జరిగింది. చాలా మంది రైతుల వివరాలు ఆన్లైన్లో కనిపించడం లేదు. – సంగెం బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక, జిల్లా అధ్యక్షుడు.