చండీగఢ్: పంజాబ్‌లోని సిక్కు పుణ్యక్షేత్రాల నిర్వహణ బాధ్యత వహిస్తున్న శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సభ్యుడు, సీనియర్ శిరోమణి అకాలీ దళ్ నాయకుడు అమర్జిత్ సింగ్ చావ్లాపై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని ఒక యాత్రికుల వసతి గృహంలో తనను బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. (Rape Case Against Akali Dal Leader) సంగ్రూర్ జిల్లాకు చెందిన బాధిత మహిళ ప్రస్తుతం బహ్రెయిన్‌లో నివసిస్తున్నది. అకాలీ దళ్ నాయకురాలు రూప్ కౌర్ సంధు ఫేస్బుక్ పేజీ ద్వారా ఒక వీడియోను ఆమె విడుదల చేసింది. ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని ఒక వసతి గృహంలో చావ్లా తన పట్ల అన్ని హద్దులు దాటారని ఆమె ఆరోపించింది. సిక్కు సమాజం ఆయనను ద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేసింది.
కాగా, అకాల్ తఖ్త్ అదనపు హెడ్ గ్రంథి మల్కిత్ సింగ్, తఖ్త్ కేశ్‌గఢ్ సాహిబ్ డ్రైవర్ మోహన్ సింగ్ తనకు అసభ్యకరమైన సందేశాలు పంపారని కూడా ఆ మహిళ ఆరోపించింది. ఆగస్ట్ 21న ఆనంద్‌పూర్ సాహిబ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. ఫిర్యాదుకు ముందు తాను అనేక సిక్కు సంస్థలను ఆశ్రయించినట్లు ఆమె చెప్పింది. ఎస్జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామిని, తాత్కాలిక అకాల్ తఖ్త్ జతేదార్ గియాని కుల్దీప్ సింగ్ గడ్గజ్లను కూడా సంప్రదించినట్లు వెల్లడించింది.
మరోవైపు ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. సీనియర్ శిరోమణి అకాలీ దళ్ నాయకుడు అమర్జిత్ సింగ్ చావ్లాపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే మరో ఇద్దరిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి కుల్వంత్ సింగ్ మన్నన్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అలాగే ఎస్జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
అయితే అమర్జిత్ సింగ్ చావ్లా ఈ ఆరోపణలను ఖండించారు. అవి అవాస్తవమని, కల్పితమని ఆయన అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనపై ఈ ఆరోపణలు రావడం రాజకీయంగా కలకలం రేపింది.