కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 10: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్‌ను సేఫ్ సిటీగా ఉంచామని, స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేశామని, బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తుందనుకుంటే కత్తులతో దాడులు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. నగరంలో బీజేపీ అధికారంలోకి వచ్చి అరాచక పాలన చేస్తున్నదని, ప్రగతి పథంలో నడుపుతారనుకుంటే దాడుల సంస్కృతిని తెరపైకి తెస్తున్నదని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని విన్నవించారు.
కరీంనగరంలోని కిసాన్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గుగులోత్ శ్రీకాంత్‌పై బీజేపీ కార్పొరేటర్ దాడి విషయంలో వెంటనే కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. కరీంనగరంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను సోమవారం సాయంత్రం నాయకులతో కలిసి గంగుల పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్‌గా అవకాశం ఇస్తే దాడుల సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు.
గతంలో ఈ సంస్కృతి లేదని, తమ పార్టీ పదేళ్లు, మరోపార్టీ కొన్నేండ్లు పాలించినా ఇలా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. ‘బీఆర్ఎస్లో ఎందుకు ఉంటున్నవ్?’ అని శ్రీకాంత్‌ను బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు బెదిరిస్తూ ఓ గుండాలా 11మందితో కలిసి వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడని ఆగ్రహించారు. వేణు బాటిల్ తీసుకొని శ్రీకాంత్‌ను పొడిచాడని, అతడు చనిపోయాడన్న భావనతో వెళ్లిపోయారని వాపోయారు. అడ్డుకున్న వారి తమ్ముడిని సైతం కొట్టారన్నారు. ఈ దాడి ద్వారా నగర ప్రజలకు బీజేపీ ఏం సంకేతం ఇస్తున్నదని ప్రశ్నించారు. బండి సంజయ్‌కు వారి పార్టీ కార్పొరేటర్లు ఏం చేస్తున్నారో తెలుస్తుందా..? అని ప్రశ్నించారు.
కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైనా గూండాల్లా వచ్చి దాడి చేశారని, అదే రోజు బండి సంజయ్ మంత్రి హోదాలో స్పందించి చర్యలు చేపడితే ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఉండేదికాదని చెప్పారు. ధీరజ్ అనే బీఆర్ఎస్ కార్యకర్తపైనా దాడి చేశారని విమర్శించారు. తమ పదేండ్ల పాలనలో కిసాన్‌నగర్‌లో రోడ్లు వేసి అభివృద్ధి చేస్తే, మీరు గెలిచిన మూడు నెలలకే ఇంత విధ్వంసమా..? అరాచకమా..? రాళ్లతో దాడులు చేస్తారా..? అని ధ్వజమెత్తారు. ఈ విషయమై తాము పోలీసులకు సంప్రదించిన వెంటనే స్పందించారని, వారి పనితీరును అభినందనలు తెలిపారు. కిసాన్నగర్ను సమస్యాత్మకంగా ప్రాంతంగా గుర్తించి పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాంత్ తమ్ముడిని కూడా చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని, పార్టీ అధిష్టానం అండగా నిలుస్తుందని అభయమిచ్చారు. మరో రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్ని లెక్కలను బరాబర్‌గా తీర్చుకుంటామన్నారు. ఆఫీస్‌పై దాడి చేసింది ఎవరు..? ధీరజ్‌పై దాడి చేసింది ఎవరో తమకు తెలుసునన్నారు. ఘటనతో సంజయ్‌కు సంబంధం లేకపోతే వెంటనే కార్పొరేటర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత బండి సంజయ్‌పైనే ఉన్నదని, ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఎడ్ల అశోక్, శ్రీకాంత్, తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.