కౌకుంట్ల(చిన్న చింతకుంట), మార్చి 14 : కురుమూర్తి స్వామి కొండలను ముట్టుకుంటే చూస్తూ ఊరుకోమని కురుమూర్తి స్వామి ఏడు కొండల పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ శివారులోని ఏడుకొండల్లో కాంచన గుహలో వెలిసిన కురుమూర్తి స్వామి కొండలకు మైనింగ్ అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం వారు కురుమూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుమూర్తి స్వామి అంటే కోట్లాది మందికి ఆరాధ్య దైవమని, మా ఆత్మగౌరవాన్ని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతినేలా వ్యవహరిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని మండిపడ్డారు.
దీనిపై సీఎం కలుగజేసుకుని వెంటనే మైనింగ్ అనుమతులు రద్దు చేసి, సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటూ, భక్తుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. కాదని ఇలాగే పనులు జరపాలని చూస్తే మాత్రం గ్రామాల నుంచి వచ్చే భక్తుల ఆగ్రహావేశాలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్, బీజేపీ, విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్, హిందూవాహిని, పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.