బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్.. కొన్నేళ్లుగా మూర్ఛ వ్యాధితో పోరాడుతున్నది. ఈ విషయాన్ని ఆమె చాలాసార్లు బహిరంగంగానే వెల్లడించింది. ఈ నాడీ సంబంధిత అనారోగ్యంపై అవగాహన కల్పించడానికీ కృషి చేస్తున్నది. ఈ క్రమంలో తాజాగా, ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఫాతిమా.. తన అనారోగ్యం, ఇతర విషయాల గురించి పంచుకున్నది. ఈ ఆరోగ్య సమస్యను అంగీకరించి, సంపూర్ణంగా స్వీకరిస్తేనే.. జీవితంలో ముందుకు సాగగలమని అభిప్రాయపడింది.
ఇక తాను మొదటిసారి మూర్ఛ వ్యాధితో బాధపడిన సందర్భాన్నీ గుర్తు చేసుకున్నది. “చిన్నతనంలోనే రెండుమూడు సార్లు నాకు మూర్ఛ వచ్చింది. ఆ తర్వాత ‘దంగల్’ కోసం శిక్షణ పొందుతున్న సమయంలోనూ మూర్ఛతో ఇబ్బంది పడ్డా! వర్కౌట్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాను. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అమీర్ సర్, సన్యా నా పక్కనే ఉన్నారు. నన్ను సకాలంలో ఆసుపత్రికి తరలించారు” అంటూ చెప్పుకొచ్చింది. అయితే, వ్యాధి నిర్ధారణ అయినప్పటికీ కొన్నిరోజులపాటు ఆ నిజాన్ని అంగీకరించలేకపోయానని చెప్పింది. “మందులు వాడితే నా కెరీర్ దెబ్బతింటుందేమోనని, ఇతరులు నన్ను బలహీనంగా చూస్తారేమోనని భయపడ్డా! మెడికేషన్ కూడా సరిగ్గా తీసుకోలేదు.
దాంతో, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకసారి అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో మూర్ఛ వచ్చింది. అత్యవసరంగా విమానాశ్రయ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది” అంటూ మరో సందర్భాన్నీ పంచుకున్నది. అయితే, ఆ సంఘటన ఫాతిమాను తీవ్రంగా భయపెట్టిందట. అప్పటి నుంచే తన అనారోగ్యాన్ని సీరియస్గా తీసుకుని, క్రమం తప్పకుండా మందులు వాడటం ప్రారంభించినట్లు వెల్లడించింది. “ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య మాత్రమే! దీనిని అంగీకరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ జీవితం గడపవచ్చు” అంటూ మూర్ఛ బాధితులకు భరోసా ఇస్తున్నది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఫాతిమా తన తదుపరి చిత్రం ‘న్యాయ’లో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నది.