ఖానాపూర్, అక్టోబర్ 31: ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల చేతివాటంతో అకాల వర్షానికి చేతికి వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిసి, తీవ్ర నష్టవాటిల్లిందని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు. బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వడ్లను శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఖానాపూర్, తర్లపాడు, పాత తర్లపాడు గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు రాజగంగన్న, గౌరికర్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను నిర్లక్ష్యం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు.
పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉన్న వడ్లు నేలపాలయ్యాయన్నారు. ఇప్పటికైనా ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనతో మాజీ సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళికతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోయిద్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, నాయకులు సుమన్, ప్రదీప్, సతీశ్, నరేందర్‌రెడ్డి, చంద్రవాస్, రమణ, రాజేశ్వర్, తిరుమలేశ్, శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలున్నారు.
బోథ్, అక్టోబర్ 31 : తడిసిన పంటలను తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధరకు ప్రభుత్వమే కొనాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బోథ్‌లోని మారెట్యార్డ్ను సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు మార్కెట్ యార్డుకు వారం పది రోజులుగా సోయా, మక్క పంటలను అమ్మకానికి తీసుకువచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాఫెడ్, రాష్ట్ర పరిధిలోని మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ద్వారా కొనకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారన్నారు. ఆయన వెంట రైతులు పీ.రవీందర్ రెడ్డి, అర అవినాష్, కే.రాజన్న, సత్యపాల్, డీ శంకర్, దత్తు, తదితరులు పాల్గొన్నారు.