హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం కావాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది. నవంబర్ 4న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ప్రతిపాదించింది. 32 ఏండ్ల కాలపరిమితితో బహిరంగ మార్కెట్ నుంచి ఈ రుణం తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ ఇండెంట్ పెట్టినట్టు శుక్రవారం ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.54,009 కోట్ల రుణాలు సమీకరించనున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్‌రెడ్డి సర్కారు ఇప్పటికే రూ.50,900 కోట్ల అప్పు తీసుకున్నది. డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసికం (క్యూ-3)లో మరో రూ.9,600 కోట్ల రుణాలకు ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగా అక్టోబర్ 14న రూ.1,000 కోట్లు తీసుకున్న రాష్ట్ర ప్ర భుత్వం.. నవంబర్ 4న రూ.1,000 కోట్ల రుణాన్ని సమీకరించనున్నది.