హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న మంచి రాధాకృష్ణమూర్తి (74), యాళ్ల శేషగిరిరావు (72) సోమవారం మృతి చెందారు. అంతకుముందు తాడి కృష్ణవేణి, కనకరత్నం సహా మరొకరు మృత్యువాతపడ్డారు. బాధితుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఉండగా, నలుగురు చిన్నారులు సైతం ఉన్నారు. వీరిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమించడంతో రాజమండ్రిలోని పిల్లల దవాఖానకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు పాలు సరఫరా చేస్తున్న కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి..? ఎన్ని ఇండ్లకు పాలు పంపిణీ చేశారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను అలర్ట్ చేశారు. పరీక్షల కోసం బాధితుల నుంచి సేకరించిన మూత్ర, రక్త నమూనాలను ఫోరెన్సిక్‌కు పంపగా, నివేదిక రావాల్సి ఉన్నది. కాగా, ఈ ఐదు రోజుల వ్యవధిలో 12 మందికి పైగా దవాఖాన పాలైనట్టు సమాచారం.