వెల్గటూర్, అక్టోబర్ 31: ఇంటర్ విద్యార్థిని ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ లో శుక్రవారం చోటుచేసుకున్నది. కొండాపూర్ గ్రామానికి చెందిన వెనంకి రవి, జ్యోతి దంపతులకు కూతురు సహస్ర (15), కుమారుడు ఉన్నారు. 2017లో జ్యోతి ఆత్మహత్య చేసుకుం ది. కొంతకాలానికి రవి మరో మహిళను వివాహం చేసుకోగా, అప్పటి నుంచి తండ్రి, పినతల్లితో కలిసి సహస్ర ఉండేది. సహస్రకు ఇటీవల చెవి నొప్పి రావడంతో ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. సహస్ర మృతిపై అ నుమానం ఉందంటూ ఆమె అమ్మమ్మ సుగుణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
పెండ్లి వాహనం, బోర్వెల్ లారీ ఢీ.. ముగ్గురు మృతి
భీమదేవరపల్లి/కురవి, అక్టోబర్ 31: పెండ్లి వాహనం, బోర్వెల్ లారీ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట, హనుమకొండ ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో సిద్దిపేట జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన అబ్బాయికి కురవి వీరభద్రస్వామి దేవస్థానంలో వివాహం జరిగింది. గురువారం రాత్రి బొలెరో వాహనంలో వధూవరులు, కుటుంబసభ్యులు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని గోపాల్పూర్ క్రాసింగ్ సమీపంలో ఆగారు. అనంతరం వెనుక నుంచి అతివేగంగా వస్తున్న బోర్వెల్ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో రెడ్డబోయిన స్వప్న అక్కడికక్కడే మృతిచెందింది. రెడ్డబోయిన కళమ్మ, రెడ్డబోయిన శ్రీనాథ్ చికిత్స పొందుతూ మరణించారు.
పాములు పట్టే వ్యక్తి పాముకాటుతో మృతి
మల్యాల, అక్టోబర్ 31 : పాములు పట్టే వ్యక్తి పాముకాటుతోనే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలకేంద్రంలో జరిగింది. మల్యాల ఎస్ఐ అనుమండ్ల నరేశ్‌కుమార్ వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 19 మల్యాలలోని ఓ ఇంటి వద్ద పాము ప్రవేశించగా, బీసీ కాలనీకి చెందిన ఆడపల్లు రాములుకు సమాచారం అందజేశాడు. రాములు ఆ పామును పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. దానిని నాట్యమాడించే క్రమంలో రాములు కుడిచేతిపై కాటు వేసింది. గమనించిన రాములు భార్య పోచవ్వ వెంటనే జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. రాములు భార్య పోచవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం
చౌటుప్పల్, అక్టోబర్ 31: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేండ్ల చిన్నారిపై 45 ఏండ్ల వయస్సున్న ఇద్దరు అత్యాచార యత్నం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన శివరాజు(47), దినేశ్(42) దివీస్ పరిశ్రమలో దినసరి కూలీలుగా పనిచేస్తూ స్థానికంగా ఉంటున్నారు. శుక్రవారం మద్యం మత్తులో ఉన్న నిందితులు చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అఘాయిత్యానికి ఒడిగట్టబోయారు. ఒక్కసారిగా చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు.
ఫుడ్‌పాయిజన్‌తో 50మంది విద్యార్థులకు అస్వస్థత
ఇటిక్యాల, అక్టోబర్ 31: జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో శుక్రవారం రాత్రి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. 120 మంది విద్యార్థులకు 105 మంది ఉన్నారు. రాత్రి భోజనంలో సాంబారు, పెరుగు, గుడ్డు ఇవ్వగా, భోజనం చేసిన కొద్దిసేపటికి 50 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరికొందరు కడుపునొప్పి అని బాధపడుతుండగా.. హాస్టల్ సిబ్బంది 108 అంబులెన్స్‌లో గద్వాల ఏరియా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నట్లు వార్డెన్ తెలిపారు.