Rinku Singh | భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న యువ బ్యాటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖంచంద్ర సింగ్ (ఖాంచంద్ర సింగ్) స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఖంచంద్ర సింగ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్టేజ్-4 లివర్ క్యాన్సర్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనను వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ (CRRT) కూడా నిర్వహించినట్టు సమాచారం. అయినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.
ఇదే సమయంలో ఐసీసీ మెన్స్ టీ 20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూ సింగ్‌కు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందింది. వెంటనే జట్టును వదిలి హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. కుటుంబంతో కలిసి రెండు రోజులపాటు ఆసుపత్రిలో గడిపిన అనంతరం, జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు ముందు మళ్లీ జట్టుతో చేరాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు రింకూ హాజరుకాలేదు. మిగిలిన ఆటగాళ్లు సాధనలో పాల్గొనగా, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన దూరంగా ఉన్నాడు. జింబాబ్వేతో కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో చేరినప్పటికీ, ఆ మ్యాచ్‌లో రింకూ సింగ్‌కు అవకాశం దక్కలేదు. కుటుంబ పరిస్థితులు, భావోద్వేగ పరిస్థితుల నడుమ జట్టుతో కొనసాగడం ఆయనకు సవాల్‌గా మారింది.
గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో రింకూ అభిషేక్ స్థానంలో ఫీల్డింగ్ చేసి ఓ క్యాచ్ జారవిడవడం మనం చూశాం. అయితే తాజాగా తన తండ్రి మరణవార్త అందుకున్న వెంటనే రింకూ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు బయలుదేరాడు. 28 ఏళ్ల రింకూ సాధారణ కుటుంబం నుంచి ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించిన క్రమంలో, తన తండ్రి పాత్ర ఎంతో కీలకమని పలుమార్లు చెప్పుకున్నాడు. కుటుంబానికి అండగా నిలిచిన తండ్రి కోల్పోవడం రింకూకు వ్యక్తిగతంగా పెద్ద లోటు. ఈ కష్ట సమయంలో అభిమానులు, సహచర క్రికెటర్లు ఆయనకు సానుభూతి తెలుపుతున్నారు.