కోహీర్, సెప్టెంబర్ 21: ఒకనాడు నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. గతంలో నిండుకుండలా దర్శనమిచ్చిన చెరువులు ప్రస్తుతం పశువుల దాహార్తిని తీర్చలేని పరిస్థితికి చేరుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పైడిగుమ్మల్ మైసమ్మ చెరువు, సజ్జాపూర్ గ్రామ శివారులోని నర్సారెడ్డి చెరువు కళ తప్పాయి. బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా పైడిగుమ్మల్ మైసమ్మ చెరువు, సజ్జాపూర్ గ్రామ నర్సారెడ్డి చెరువులను అభివృద్ధి చేశారు.
ఆయా చెరువుల్లోని మట్టి పూడిక తీయించి కట్టలను దృఢంగా తయారు చేశారు. తద్వారా కురిసిన వర్షాలకు చెరువులు నిండాయి. కానీ, కాలక్రమంలో చెరువులు నిండడం గగనమైంది. సమీప పొలాల్లోని రైతులు, వ్యాపారులు వాటిలోకి వర్ష్షపు నీరు రాకుండా అడ్డుకట్టలను వేశారు. అందులోకి వరద రాకుండా అడ్డంకులను సృష్టించారు. దీంతో చెరువులకు నీరురాక కళతప్పాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఇరవైకి పైగా ఉన్న చెరువులు నిండాయి.
కానీ, పైడిగుమ్మల్ మైసమ్మ, సజ్జాపూర్ గ్రామ నర్సారెడ్డి చెరువుల మాత్రం నిండలేదు. దీంతో వేసవిలో పశువులకు నీరు లభించే అవకాశాలు కనిపించడం లేదు. చెరువుల్లో నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే తమ పశువుల దాహార్తి తీరుస్తాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్తితిని చూసి వారు నిరాశకు లోనవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
చెరువులను అభివృద్ధి చేస్తాం..
కోహీర్ మండలంలోని పైడిగుమ్మల్, సజ్జాపూర్ గ్రామాలకు చెందిన
రెండు చెరువుల్లోకి నీరు రాకుండా అడ్డుకట్టలను వేయడంపై మాకు సమాచారం అందింది. దీనిపై చర్యలు తీసుకుంటాం. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఐదు చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
– రవీందర్, నీటిపారుదల శాఖ ఏఈ, కోహీర్ (సంగారెడ్డి జిల్లా)