Narsapur | నర్సాపూర్, సెప్టెంబర్ 21: దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు దుకాణాల్లో, ఇండ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు.. తాజాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కన్నువేశారు. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు చొరబడ్డారు. పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న రఘువరుణ్ ప్రతి రోజు ఉదయం 9 గంటలకు తాళం తీసి సాయంత్రం 4 గంటలకు మూసివేసి ఇంటికి వెల్తారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సైతం పీహెచ్సీకి తాళం వెళి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పీహెచ్సీకి సంబంధించిన సిబ్బంది తాళం తీసి చూడగా అందులోని వస్తువులు మొత్తం చిందరవందరగా పడేసి ఉన్నాయి. పీహెచ్సీ వెనుక వైపునున్న కిటికి రాడ్ సహాయంతో తొలగించి లోపలికి చొరబడ్డారు. పాత ఇన్వర్టర్తో పాటు దానికి సంబంధించిన మూడు బ్యాటరీలను ఎత్తుకు వెళ్లారు. మెడికల్ ఆఫీసర్ రఘువరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం వివరించారు.