Dubbaka | హైదరాబాద్ : దుబ్బాకలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు కూరగాయలు అమ్మే ఓ మహిళను మోసం చేశారు. అప్రమత్తమైన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక మార్కెట్లో ఓ మహిళ కూరగాయలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తోంది. అయితే శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మహిళ వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. ఇక రూ. 200 నోట్లు నాలుగు చొప్పున ఆమెకు చెల్లించారు. ఆ తర్వాత ఆమె సరుకులు కొనేందుకు అక్కడే ఉన్న ఓ హోల్‌సేల్ షాపుకు వెళ్లింది. సరుకులు కొన్న తర్వాత పైసలు ఇవ్వగా.. రూ. 200 నోట్లు నకిలీవని తేలింది. నాలుగింటిలో మూడు నోట్లు సేమ్ సీరియల్ నంబర్‌ను కలిగి ఉన్నాయని హోల్ సేల్ షాపు యజమాని మహిళకు చెప్పాడు.
దీంతో లబోదిబోమంటూ.. బాధిత మహిళ దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మార్కెట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్న వారిని తర్వలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.