వాషింగ్టన్ : బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తమకు తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం అఫ్గానిస్థాన్‌ను ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు. గురువారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి మాట్లాడుతూ చైనా అణు కేంద్రానికి గంట సేపట్లో ప్రయాణించేంత దూరంలో ఉన్న బగ్రామ్‌ను వెనక్కు తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తున్నదని ట్రంప్ తెలిపారు. ఇందుకోసం సైన్యాన్ని పంపిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ నేరుగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. ‘దీని గురించి మాట్లాడం. మాకు ఆ స్థావరం వెంటనే కావాలి. వాళ్లివ్వకపోతే, నేనేం చేస్తానో మీరు చూస్తారు’ అని ట్రంప్ బదులిచ్చారు.
భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ మరోసారి చెప్పారు. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవటం.. తన ఘనతేనని చెప్పుకున్నారు. ‘చూడండి.. పాక్‌తో యుద్ధాన్ని ఆపకపోతే అమెరికాతో వాణిజ్యం ఉండదని హెచ్చరించా. దీంతో న్యూఢిల్లీ వెంటనే యుద్ధాన్ని ఆపేసింది’ అని ట్రంప్ అన్నారు. భారత్-పాక్ సహా ఏడు యుద్ధాల్ని ఆపినందుకు తనకు ఏడు నోబెల్ పురస్కారాలు రావాలని అన్నారు.