ముత్తారం, మార్చి 12: ‘సీఎం సారూ నాకు బతకాలని ఉన్నది.. దయచేసి నన్ను బతికించండి.. ఈహెచ్ఎస్ కార్డు పనిచేయడంలేదు.. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వమే కాపాడకుంటే ఎవరు కాపాడుతరు’ అంటూ గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేడుకుంటున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాల్లో కెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కానుగంటి అంజయ్యకు భార్య, కొడుకు ఉన్నారు. ప్రస్తుతం ముత్తారం మండలం పారుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు.
ఇటీవల గొంతు క్యాన్సర్ రావడంతో నెల రోజులుగా వైద్యం చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన, వైద్యానికి ఇప్పటికే 30 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఇంకా ఖర్చు చేయడానికి తనకు స్తోమత లేదని వాపోయాడు. ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డు ఎక్కడా పనిచేయడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వమే కాపాడకుంటే ఎవరు కాపాడుతారని ఆవేదన చెందాడు.
తనకు బతకాలని ఉందంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి ఉద్యోగులు, స్నేహితులు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం ఇచ్చే హెల్త్‌కార్డులు ఇలాంటి సమయాల్లో పనిచేయకపోతే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి..అంజయ్యను బతికించాలని వేడుకున్నారు. దాతలు స్పందించి అంజయ్య వైద్యానికి 9959522650కు ఫోన్‌పే లేదా గూగుల్ పే ద్వారా సాయం చేయాలని కోరుతున్నారు.