చండీగఢ్: సంచార సర్కస్‌కు చెందిన వ్యక్తి ‘సజీవ సమాధి’ స్టంట్ బెడిసికొట్టింది. చాలా గంటలపాటు అతడ్ని సమాధి చేయడంతో ఊపిరి అందక మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Live Burial Stunt) హర్యానాలోని నూహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తౌరు సబ్‌డివిజన్ పరిధిలోని ఖోరీ కలాన్‌లో గత వారం రోజులుగా సంచార సైకిల్ సర్కస్ బృందం ప్రదర్శన ప్రజలను అలరిస్తోంది. ఫరీదాబాద్ జిల్లా గౌంచి గ్రామానికి చెందిన 27 ఏళ్ల దీపక్ సైకిల్‌పై పలు విన్యాసాలు చేశాడు. చూడకుండా సైకిల్ తొక్కడం, హ్యాండిల్ బార్‌పై చేతులతో బ్యాలెన్స్ చేయడం, కదులుతున్న సైకిల్‌పై నిటారుగా నిల్చోవడం వంటి సాహసోపేతమైన విన్యాసాలతో అందరిని ఆకట్టుకున్నాడు.
కాగా, సర్కస్ చివరి రోజున ప్రత్యేక ప్రదర్శనలో దీపక్ పాల్గొన్నాడు. అతడ్ని ఒక సంచిలో బంధించారు. సజీవ సమాధి కోసం తవ్విన ఒక గుంతలోకి దించి దానిని కప్పేశారు. 24 గంటల తర్వాత అతడ్ని సజీవంగా బయటకు తీస్తామని సర్కాస్ నిర్వాహకులు చెప్పారు.
అయితే దీపక్ సుమారు 36 గంటల పాటు ఆ సమాధిలో ఉండిపోయాడు. సర్కస్ నిర్వాహకులు ఆ తర్వాత ఆ గుంతను తెరిచి చూడగా అతడు మరణించాడు. భూమి లోపలున్న సమాధిలో అతడు ఎక్కువ సేపు ఉండటం వల్ల ఊపిరి ఆడక చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.
మరోవైపు సర్కస్ నిర్వాహకులపై స్థానికులు మండిపడ్డారు. రూ. 7,100 వసూలయ్యే వరకు దీపక్‌ను బయటకు తీయబోమని సర్కస్ నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పినట్లు కొందరు ఆరోపించారు. ఈ షరతు కారణంగానే 24 గంటల కంటే చాలా ఆలస్యంగా గుంతను తెరువడంతో దీపక్ మరణించినట్లు నిర్వాహకులపై మండిపడ్డారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దీపక్‌ను సమయానికి ఎందుకు బయటకు తీయలేదు, ఆ జాప్యానికి ఎవరు బాధ్యులు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.