హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): వానకాలం నాటికి యూరియా కొరత తప్పదేమో అనే అభిప్రాయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తంచేశారు. వానకాలం వరకు ప్రభుత్వం వద్ద 50వేల టన్నులకు మించి యూరియా నిల్వలు(బఫర్ స్టాక్) ఉండకపోవచ్చని తెలిపారు. ఇదే నిజమైతే మరోసారి యూరియా సంక్షోభం తప్పదని ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో రాష్ర్టానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏప్రిల్, మే, జూన్లో ప్రతి నెలా 2 లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ రాశారు. నిరుడు వానకాలంలో యూరియా బఫర్ నిల్వలు 1.99 లక్షల టన్నులే ఉండటంతో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే ఈ ఏడాది ప్రారంభ ని ల్వలు 50 వేలకు మించి ఉండకపోవచ్చని, ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరా రు. ఖరీఫ్ సీజన్లో జూలై, ఆగస్టు నెలల్లో యూరియాకు డిమాండ్ ఎకువగా ఉంటుందని, నెలకు కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని మంత్రి తెలిపారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే బఫర్స్టాక్ను పెంచుకునేలా యూరియా సరఫరా చేయాలని కోరారు.