హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నిరుద్యోగులు పోరుబాట పడుతున్నారు. వరుస నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కదనభేరి మోగించారు. శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు దిల్సుఖ్నగర్ నుంచి పుస్తకాలతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తారు. శనివారం టీజీపీఎస్సీ కార్యాలయం, ఆదివారం అసెంబ్లీని ముట్టడిస్తామని ఇప్పటికే తమ కార్యాచరణ ప్రకటించారు. నిరుద్యోగులకు శాపంలా మారిన 4,46,29,108 జీవోలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మిలియన్ మార్చ్ తరహాలో నిర్వహిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని నిరుద్యోగ సంఘాల నేతలు కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట నిలుపుకోలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌ను సందర్శించిన రాహుల్‌గాంధీ.. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్యను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
2024 ఆగస్టులో అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ బోగస్‌లా మారిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్లు రాక సమయం, డబ్బు వృథా అవుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గ్రూప్స్, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్, మెగా డీఎస్సీ, విద్యుత్తు శాఖలో ఏఈ, ఎస్ఈ, జేఎల్ఎం, ఏఈఈ, ఎఫ్‌బీవో, జీపీవో, మిగతా అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆందోళనలు చేపడుతున్నామని నిరుద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు.