తెలంగాణ మట్టిలో ప్రభవించిన అమూల్య రత్నం ఎస్వీ రామారావు. తన కలంతో, గళంతో గర్జించి తన అస్తిత్వాన్ని సాహిత్య లోకానికి చాటారు. సంస్థానాల ఖిల్లా అయిన పాలమూరు జిల్లాలోని శ్రీరంగాపురంలో జన్మించిన ఆయన వనపర్తి, హైదరాబాద్‌లలో విద్య నభ్యసించారు. ఉస్మానియా వర్సిటీలో ఆచార్యులుగా, శాఖాధిపతిగా, పాఠ్యప్రణాళికా విభాగపు అధ్యక్షులుగా, ఉత్తమ అధ్యాపకులుగా, పరిశోధకులుగా, విశిష్ట విమర్శకులుగా, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారు. అంతేకాదు, విమర్శనా విన్యాసంతో తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన ప్రతిభా పరుసవేది ఆయన.
నడిగడ్డ పులిబిడ్డ అయిన సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తితో తెలంగాణ కవితాశక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన అపరచాణక్యుడు రామారావు. గడియారం రామకృష్ణ శర్మ గాంభీర్యాన్ని, విద్వత్ గద్వాల కవుల వైదుష్యాన్ని కూలంకషంగా గర్భీకరించుకున్న సుప్త చైతన్య విమర్శనా సూర్యుడై తెలుగు నేలను పులకింపజేశారు. ఆకారంలో వామనుడైనా విద్వత్తులో త్రివిక్రమార్కుడిగా విజృంభించి తెలంగాణ సాహిత్య శక్తిని బలంగా, సోదాహరణంగా ఆధారాలతో నిరూపించిన పరిశోధనా పారంగతుడు. సాహిత్య విద్యార్థులు సాధారణంగా కవిత్వం వైపు పరుగులు తీస్తుంటే రామారావు మాత్రం విమర్శ వైపు తన దృష్టిని సారించడం ఆయన వ్యక్తిత్వ వైవిధ్యానికి ప్రబల నిదర్శనం.
తెలుగు సాహిత్యాభిమానంతో నిరంతరం సాహిత్య అధ్యయనం చేస్తూ పదిహేనేండ్ల వయస్సు నుంచే రామారావు తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. విరివిగా వ్యాసాలు రాస్తూనే, సినిమా విమర్శకులుగా తెలుగు, హిందీ సినిమాలకు చక్కటి సమీక్షలనందించారు. ‘అన్వీక్షణం’, ‘సమవీక్షణం’, ‘అభివీక్షణం’ పేరిట మూడు విశిష్ట వ్యాస సంపుటాలను తెలుగు సాహితీ లోకానికి అందించారు. ఈ వ్యాసాలన్నీ వివిధ
సందర్భాలలో సాహిత్యానికి సంబంధించిన విభిన్న అంశాలపై అతనికి గల ప్రతిభా పాటవాలకు అద్దం పడుతున్నాయి.
పక్షపాత బుద్ధితో, స్వార్థ చింతనతో తెలంగాణ కవులను కవిత్వాన్ని నిరాదరణకు గురిచేసిన సాహిత్య పరిశోధకుల ప్రాంతీయ వివక్ష వల్ల సిసలైన తెలంగాణ కవితా వైభవ ప్రభావాలు మరుగునపడ్డాయి. అలా మరుగునపడిన మాణిక్యాలను వెలికితీసిన విద్వాంసుడు ఎస్వీ. స్వాభిమానంతో, నిష్పక్షపాత బుద్ధితో తెలంగాణ సాహిత్య విద్వత్తును దేశానికి నిర్మొహమాటంగా ఎలుగెత్తి చాటి తెలంగాణ కవితా కోహినూరు వజ్రాలను పదునుపెట్టి పట్టాభిషేకం చేయించిన ప్రతిభావంతుడు. విశ్వవిద్యాలయంలో విద్యాబోధన సాగిస్తూ, పరిశోధకులకు మార్గదర్శనం చేస్తూనే కవులకు జరుగుతున్న అన్యాయానికి అంతర్మథనం చెంది తర్కబద్ధమైన నిశిత పరిశీలనా దృష్టితో తెలంగాణ సాహిత్య శక్తిని నిర్దిష్టమైన ఆధారాలతో సాహిత్య చరిత్రకు అంకురార్పణ చేశారు.
జంట కవులమని వీరంగం తొక్కుతూ, తమను ఎదిరించే కవులే లేరని అహంభావంతో రెచ్చిపోయిన తిరుపతి వేంకటకవులు విద్వత్ గద్వాల సంస్థానానికి చేరి బుక్కపట్నం బాల సరస్వతి చేతిలో శృంగభంగం పొందిన ఉదంతం సాహిత్య లోకానికి సుపరిచితమే. తిరుపతి వేంకటకవుల నెదిరించగలిగిన విద్వాంసుల పుట్టినిల్లయిన గద్వాల ఘనచరిత్ర తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాధ్యాయం వంటిది. ఆశు కవితా చక్రవర్తులు, అష్టభాషా నిష్ణాతులు, చిత్ర బంధశ్లేష కవితా పారంగతులను పోషించిన గద్వాల సాహిత్య ఘనకీర్తి మకుటాయమానమై విరాజిల్లినది. ‘భైరవ తంత్రం’ అనే తొలి సంస్కృత గ్రంథాన్ని రాసిన మంథాన భైరవుడు పాలమూరు వాసి అని లోకానికి చాటిన రామారావు అభినందనీయులు.
సింహగిరి వచనాలు రాసిన కృష్ణమాచార్యులు పాలమూరు జిల్లావాసి అని తెలియజేయడం రామారావు పారదర్శక పరిశీలనకు సప్రమాణమైన ఉదాహరణ. అన్నం భట్టు అనే పండితులు తర్కశాస్త్ర గ్రంథాన్ని రచించారు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణమనే ద్విపద కావ్యం రాశారు. ఇది తొలి తెలుగు రామాయణం. తొలి తెలుగు రచయిత్రి కుప్పాంబిక పాలమూరు వాసి అని తేల్చిచెప్పిన రామారావు నిశిత పరిశీలనా దృష్టికి నిలువెత్తు నీరాజనం. చిత్రభారతం రాసిన చెరిగొండ ధర్మన్న పాలమూరు వాస్తవ్యులని, ఉత్తర రామాయణం రచించిన కంకంటి పాపరాజు పాలమూరు వాస్తవ్యులని, అప్పకవీయమనే లక్షణ గ్రంథాన్ని రచించిన అప్పకవి పాలమూరు వాస్తవ్యులని రామారావు తేల్చిచెప్పారు.
ఒకవైపు వర్సిటీ స్థాయిలో సాహిత్య విద్యార్థులకు పాఠాలను బోధిస్తూనే, పరిశోధన రంగానికి బాటలు వేశారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాహిత్య చైతన్య నిర్మాణం కోసం ‘జ్యోతిర్మయి’ అనే సాహిత్య సంస్థను స్థాపించి సభలు, సమావేశాలు నిర్వహించారు. కవి సమ్మేళనాలు, చర్చాగోష్టుల ద్వారా జిల్లా వ్యాప్తంగా సాహిత్య చైతన్య జ్యోతిలా వెలుగులీనుతూ నిరంతరం సృజనాత్మక భావాలను సాహిత్యవేత్తల గుండెలలో మేల్కొల్పుతూ వేగుచుక్కలా దిశానిర్దేశం చేసిన రామారావు సమకాలీన సాహిత్య మార్గనిర్దేశకులని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
జ్యోతిర్మయి సాహితీసంస్థ ద్వారా ప్రాచీన, అర్వాచీన సాహితీపరులు, కళాకారుల వివరాలను సేకరించడం, జిల్లాలోని పవిత్ర, చారిత్రక స్థలాల సమాచారం సేకరించి ప్రకటించడం ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ప్రతిభావంతులైన ప్రతిష్టిత వ్యక్తులతో ప్రేరణాత్మకమైన ప్రసంగాలు ఇప్పించి యువ సాహితీవేత్తలను కవులుగా, కళాకారులుగా మలచడానికి ఎంతో కృషిచేశారు. వనపర్తిలో జ్యోతిర్మయి సంస్థ ప్రథమ వార్షికోత్సవంలో కవితా సంకలనం ఆవిష్కరింపజేశారు. 33 మంది కవుల కవితలను ప్రకటించారు. ఈ కవితా సంచికలో కేశవపంతుల రాసిన రావమ్మ భారతి, రమ్ము జ్యోతిర్మయీ స్వాగత గీతం ప్రచురింపబడింది. ఈ గ్రంథాన్ని నాటి ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రికి అంకితమిచ్చారు. ఈ కవితా సంకలనానికి డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి పీఠిక రాశారు. ద్వితీయ వార్షికోత్సవంలో కథా రచయితలను పరిచయం చేశారు. ఐదు కథల సంపుటిని ఆవిష్కరింపజేశారు. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి-‘పరాజితులు’, కాచిరాజు శేషగిరిరావు-‘మాయా మాలవగౌళ’, పోల్కంపల్లి శాంతాదేవి-‘సమర్పణ’, ప్రభాకర్- ‘సమానంతర రేఖలు’, సి.నాగేశ్వరరావు- ‘ఒకటి రెండుల మధ్య’ కథల సంపుటాలు ప్రచురితమయ్యాయి. ద్వితీయ వార్షికోత్సవ సభలో సుప్రసిద్ధ కవులు గుంటూరు శేషేంద్రశర్మ, అరిపిరాల విశ్వం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తెలంగాణలో కవులే లేరని ఎగతాళి చేసిన కోస్తా విద్వాంసుల దురహంకారానికి అడ్డుకట్ట వేసి గోలకొండ చరిత పేరు మీదుగా సంకలనాలు వెలువరించి సవాలు విసిరిన తెలంగాణ తేజ విరాజితుడు, తెలంగాణ కవితా మర్మజ్ఞుడు సురవరం ప్రతాపరెడ్డిని, భాషాకోవిదుడు బూర్గుల రామకృష్ణారావును, కవి, సంస్కర్త, నిత్య చైతన్యశీలి గడియారం రామకృష్ణ శర్మను, పాలమూరు మట్టిలో పరిమళించిన తిరుమలరెడ్డి యశోదరెడ్డిని, దిగ్దంతుల వంటి ధీమంతులను కాకలు తీరిన కవి బ్రహ్మలనెందరినో అక్షరబద్ధం చేసిన సేద్యగాడు రామారావు.
తెలుగుజాతి ఆయనకు రుణపడి ఉంటుంది. ఆయన సృష్టించిన సాహిత్యం నిత్య నూతనమై, సాహిత్య విద్యార్థులకు పరిశోధకులకు రాచమార్గమై, మార్గదర్శకమై నిలుస్తుందనడంలో సందేహం లేదు. రామారావు అంతర్నేత్రాలతో దర్శించిన అంశాలను నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా, సూటిగా, సురచిరంగా, సున్నితంగా వివరించిన తీరు అనితర సాధ్యమైనది. రామారావు కీర్తి తెలుగు భాషామతల్లి కిరీటంలో కలికితురాయిగా నిలిచి కవులకు, పరిశోధకులకు, రచయితలకు నిరంతరం ప్రేరణగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విలువైన సాహితీ సంపదను వెలికితీసి, వెలుగులోకి తెచ్చిన నిత్య తపస్వి. సాహితీప్రియుల మనసును చూరగొన్న ధన్యజీవికి హృదయపూర్వక నివాళులు.
(వ్యాసకర్త: తెలుగు భాషోపాధ్యాయిని)
పులి జమున 8500169682