Harish Rao | హైదరాబాద్ : బీద రైతుల కడుపుకొట్టి, బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే భాద్యతను సీఎం భుజాన వేసుకోవడంతో రైతులపై తరచుగా ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు లాఠీలు ప్రయోగిస్తున్నారు అని మండిపడ్డారు.
నిన్న జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషం. పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి.. తన జిల్లాలోనే ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా స్పందించరా? పోలీసులు 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై కేసులు పెట్టి, 12 మందిని రిమాండ్‌కి పంపించడం దుర్మార్గం అని మండిపడ్డారు.
రైతులను కొట్టించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై కానీ, బౌన్సర్లపై కానీ ఎందుకు కేసులు పెటలేదో చెప్పాలని రేవంత్ సర్కారుని ప్రశ్నిస్తున్నా? కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయి రేవంత్ రెడ్డి? లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడా రైతులకు బేడీలు వేసిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పుపట్టినా బుద్ధి రాలేదు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులను కొట్టారు. మీ రియల్ ఎస్టేట్ దందాలు పెంచుకోవడానికి 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ విషయంలో కూడా రైతులపై కేసులు పెట్టినవ్. మేము అధికారంలోకి వస్తే ఫార్మా సిటీ భూములు తిరిగిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చి తిరిగి అదే రైతులపై కేసులు పెట్టినవ్. జహీరాబాద్ న్యాలకల్ రైతులపై విచక్షణారహితంగా దాడి చేసి అక్రమ కేసులు పెట్టించినవ్. సూర్యాపేట జిల్లా చిలకలూరు గ్రామం రైతులు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే 42 మందిపై కేసులు పెట్టి పోలీస్ జులుం చూపించినవ్. ధాన్యం కోతలను ప్రశ్నించినందుకు నిర్మల్ జిల్లా ఏర్వచింతలో రైతులపై కేసులు పెట్టించినవ్. ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్ రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
రైతులకు, ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని చేయడం లేదు కానీ, పెద్దలకు మాత్రం భూములను కట్టబెడుతవ్. రైతులను కొట్టు.. కమిషన్లు పట్టు అనే విధంగా సాగుతుంది నీ పాలన. తెలంగాణ రైతు లోకం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు. అరెస్ట్ చేసిన పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.