ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా ఐదు కోట్ల పద్దెనిమిది వేల రూపాయలు మహిళా సంఘాలకు రాష్ట్ర సర్కారు బాకీ పడింది. నాలుగు సీజన్ల నుంచి ధాన్యం కొనుగోళ్ల కమీషన్ చెల్లించకపోవడంతో మహిళలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. అక్కడిక్కడ అప్పులు తెచ్చి కొనుగోలు కేంద్రాలు నడిపిస్తే, వడ్డీలతో తడిసి మోపెడవుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని పదే పదే చెబుతున్న ప్రభుత్వం పెద్దలు, కనీసం కమీషన్లు ఇప్పించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 3 : దశాబ్దంన్నర కాలంగా మహిళా సంఘాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా, సంఘాలకు క్వింటాల్ చొప్పున ప్రభుత్వం కమీషన్ చెల్లిస్తున్నది. గ్రామాల్లో ఏటా వంతుల వారీగా స్వయం సహాయక సంఘాలు వీవోల ఆధ్వర్యంలో ధాన్యం సేకరించి, పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తున్నాయి. వాస్తవానికి కేంద్రాల నిర్వాహకులకు ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ప్రభుత్వం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఆ మొత్తంతో కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు మౌలిక వసతులు కల్పించడం, కొనుగోళ్లకు అవసరమైన యంత్ర పరికరాల పర్చేజింగ్, గన్నీ సంచులు కుట్టేందుకు అవసరమైన దారం, ఇతరత్రా కొనుగోళ్లు చేపడుతారు. అనంతరం మొబిలైజేషన్ అడ్వాన్స్ మినహాయించుకుని వారికందించే కమీషన్ చెల్లిస్తారు. అయితే, ఈ విధానం అటకెక్కగా కొన్ని సీజన్లనుంచి కేంద్రాల నిర్వాహకులే అప్పు తెచ్చి కొనుగోలుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకుంటున్నారు. కమీషన్ వచ్చిన అనంతరం వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారు. గత రెండేళ్లుగా కమీషన్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగి, తమకు మిగిలేదేమి లేదనే అసంతృప్తి వీవోల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 2023-24 వానకాలంలో 3,28,436 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా, కోటీ 5లక్షల 8వేల కమీషన్ రూపేణా వీవోలకు చెల్లించాల్సి ఉన్నది. అందులో 73.56 లక్షలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా 31.52 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. అదే ఏడాది యాసంగి సీజన్లో 4,51,528 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా కోటీ 44లక్షల 29వేల కమీషన్, 2024-25 వానకాలం సీజన్లో 2,99,040 క్వింటాళ్ల ధాన్యం సేకరణకు 95.68 లక్షలు చెల్లించాల్సి ఉన్నది.
మొత్తం ఈ మూడు సీజన్లలో 2 కోట్లా 71 లక్షల 49 వేలు విడుదల చేయాల్సి ఉన్నది. 2024-25 యాసంగి సీజన్లో జిల్లాలో 7,14,749 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సంబంధించి 2 కోట్ల 28లక్షల 69వేలు కమీషన్ చెల్లించాలి. మొత్తంగా 5 కోట్ల 18వేలు బాకీ పడ్డట్టు స్పష్టమవుతున్నది. ఎండనకా, వాననకా నెలల తరబడి దుమ్ము, ధూళితో పోటీ పడ్డా తమకు సమయానికి కమీషన్ అందించడం లేదని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రాబోయే సీజన్లో ధాన్యం సేకరించడంపై పడనుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు చెల్లించాల్సిన కమీషన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తొందరల్లోనే బకాయిపడ్డ కమీషన్ విడుదలయ్యే అవకాశమున్నది. ప్రభుత్వం విడుదల చేయగానే డీఆర్డీవో ఖాతాలో జమచేస్తాం.
– రజినీకాంత్, పౌరసరఫరాల శాఖ డీఎం (కరీంనగర్)