Raashi Khanna | ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నరాశీ ఖన్నాకి సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతుంది. నటన అనేది తన గోల్ కాదని, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పుకొచ్చింది. చదువులో ఎప్పుడూ ముందు వరుసలో నిలిచిన ఈ ఢిల్లీ అమ్మాయి, జీవితంలో టర్నింగ్ పాయింట్స్ గురించి ఊహించలేదు. 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించిన రాశి ఖన్నా, చిన్నప్పటి నుంచే పాఠశాలలో టాపర్‌గా నిలిచేది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే కొంతకాలం అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ కోసం కాపీ రైటింగ్ కూడా చేసింది. అదే సమయంలో ఐఏఎస్ కావాలన్న స్వప్నాన్ని గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగింది. కానీ జీవితంలో ఊహించని మలుపులతో నటన వైపు వచ్చేసింది.
డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ అవకాశాలు వచ్చిన రాశి, తక్కువ సమయంలోనే వెండితెరపై అడుగుపెట్టింది. 2013లో సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వచ్చిన ‘మద్రాస్ కేఫ్’ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో జాన్ అబ్రహం భార్యగా నటించిన ఈమెను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. 2014లో నాగశౌర్యతో కలిసి నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రాశి ఖన్నా. ఆ తర్వాత ‘మనమ్’, ‘తొలిప్రేమ’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’, ‘సర్దార్’, ‘థాంక్యూ’ వంటి చిత్రాల్లో నటించి క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న కలను పక్కన పెట్టి, ఇప్పుడు ఒక్కో చిత్రానికి కోటికి పైగా పారితోషికం తీసుకుంటున్న రాశి ఖన్నా, తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో కూడా తన స్థానాన్ని కల్పించుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల పవన్ బర్త్‌డే సందర్భంగా షూటింగ్ సెట్స్‌లో నుంచి ఒక ఫోటో లీక్ చేసి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చింది. మొత్తానికి రాశీ ఖన్నా డ్రీమ్ గోల్ చాలా పెద్దదే అని తెలుసుకొని ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.