Monsoon : దేశవ్యాప్తంగా రైతులు, జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఆలస్యం కానున్నది. మే 26న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది. అయితే ఆ అంచనాలు పూర్తిగా తప్పాయి. కేరళ (Kerala) ను నైరుతి రుతుపవనాలు తాకేందుకు అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. దాంతో రుతుపవనాలు సాధారణ తేదీ అయిన జూన్ 1 కంటే కొద్దిగా ఆలస్యంగా.. అంటే జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
రుతుపవనాల ఆగమనాన్ని ప్రకటించడానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు అవసరం. కేరళలోని 14 కేంద్రాలలో కనీసం 60 శాతం కేంద్రాల్లో వరుసగా రెండు రోజులపాటు 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. దాంతోపాటు గాలి వేగం, మేఘాల సాంద్రత వంటివి కూడా అనుకూలంగా ఉండాలి. అయితే మే 25 నాటికి ఈ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, ఎర్నాకుళం జిల్లాల్లో సాధారణంగా కురిసే తొలకరి జల్లులు పడుతున్నాయి.
ఒకవైపు రుతుపవనాల రాక ఆలస్యం అవుతుండగా.. మరోవైపు ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత కూడా ఉత్తర దిశగా వాటి కదలిక నెమ్మదిగా, తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల ఆలస్యం పెద్ద సమస్య కాకపోయినా, మొత్తం సీజన్లో వర్షపాతం ఎలా ఉంటుందనేది ఆందోళన కలిగిస్తోంది.