– త్వరంలో పీహెచ్ఎ నోటీఫికేషన్, ఫార్మస్సీ, లా తోపాటు పలు యూజీ, పీజీ కోర్సుల సిలబస్ ఆమోదం
– నూతన కోర్సులు ఎంఏ ఉర్దూ, ఎంఈడీ, ఎంపీఈడీల అనుమతికై ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు
– 2026-27 విద్యా సంవత్సరం వర్సిటీ బడ్జెట్, బ్యాక్లాగ్ వన్ టైం పరీక్షల నిర్వహణకై ఆమోదం
రామగిరి, మే 26 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అకాడమిక్ సెనెట్ సమావేశం మంగళవారం వర్సిటీ సమావేశం మందిరంలో నిర్వహించారు. యూనివర్సిటీ అభివృద్ధితో పాటు నూతన కోర్సులు, సిలబస్, బడ్జెట్, పీహెచ్ఎ నూతన రూల్స్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తొలుత గత వారంలో మరణించిన ఎంజీయూ విద్యావిభాగం డీన్ ప్రొ.ఎ.రామకృష్ణకు శ్రద్ధంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వీసీ ప్రొ.ఖాజా అల్తఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో అత్యంత నాణ్యత ప్రమాణాలతో విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యభోధన సాగుతుందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి విజయవంతంగా బయోమెట్రిక్ హాజరు అమలు, హాజరు ఆధారంగానే వర్సిటీ క్యాంపస్ కళాశాలలో చదివే విద్యార్థులకు పరీక్షల ఫీజుల అనుమతి, ఇతర అంశాలను అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల సౌకర్యంకై నూతన హాస్టల్స్ నిర్మాణం, అదే విధంగా పరిపాలన భవనం నిర్మాణం ఇతర అంశాలను వెల్లడించారు.
ఈ విద్యా సంవత్సరం నుండి యూనివర్సిటీలో ఫార్మస్సీ, లా కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ఉన్నత విద్యామండలి ఆదేశాలను అమలు చేస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై చర్యలు తీసుకుంటు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికై వర్సిటీ తొలి విశ్రాంత వీసీ ప్రొ.గంగాధర్‌రావు, మాజీ వీసీలు కట్టా నర్సింహారెడ్డి, భాగ్యనారాయణ మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయా అంశాలపై చర్చ చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా.వై.ప్రశాంతి, సీఓఈ డా.జి.ఉపేందర్‌రెడ్డి, వివిధ విభాగాల డీన్స్ ప్రొ.ఆకుల రవి, ప్రొ.అల్వాల రవి, రేఖ, అన్నపూర్ణబుట్టి, సెనెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
– బ్యాక్లాగ్ యూజీ, పీజీ, బీఈడీ ఇతర కోర్సులకు వన్‌టైం పరీక్షల నిర్వహణ
– నూతన కోర్సులైన ఫార్మస్సీ, లా తోపాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న యూజీ, పీజీ కోర్సుల సిలబస్ ఆమోదం
– నూతన పీహెచ్ రూల్స్, అడ్మిషన్లకై నోఫికేషన్ విడుదల
– యూనివర్సిటీలో నూతనంగా ప్రవేశపెట్టే ఎంఏ ఉర్దూ, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల నిర్వహణకై ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు
– యూనివర్సిటీ 2026- 27 విద్యా సం. డ్రాఫ్ట్ బడ్జెట్ బడ్జెట్ రూ.40 కోట్లపైనే ఆమోదం తదితర అంశాలను చర్చించారు.

ఎంజీయూ అకాడమిక్ సెనెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం