న్యూఢిల్లీ, జూలై 23: నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరసనలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 20న విద్యార్థులు నిర్వహించిన చలో పార్లమెంట్ మార్చ్‌పై పోలీసుల అణచివేత చర్యలను ఖండించడంలో సైతం రాహుల్ స్పందనపై నెటిజన్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పోలీసుల అణచివేత చర్యలకు తీవ్రంగా గాయపడి దవాఖానలలో చికిత్స పొందుతున్న విద్యార్థులు, యువజనులను పరామర్శించడానికి రాహుల్ వెళ్లకపోవడం, కనీసం జంతర్ మంతర్‌ను సందర్శించి యువ నిరసనకారులను పలుకరించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థులపై పోలీసుల చర్య జరిగిన మరుసటి రోజున రాహుల్ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో మెరుపు ధర్నాకు దిగడం, తదనంతరం అరెస్టు కావడం వంటి నాటకీయ పరిణామాలు విద్యార్థుల నిరసన ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ఆడిన డ్రామాగా నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై ఆమరణ దీక్ష చేస్తున్న విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి సైతం నిజాయితీ కొరవడిన నిరసనగా అభివర్ణించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళి అర్పించేందుకు గురువారం ఇండియా కూటమి నాయకులతో కలసి మూడు బస్సుల్లో సెంట్రల్ ఢిల్లీలోని గాంధీ స్మృతిని రాహుల్ సందర్శించడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింంది. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.