చిగురుమామిడి, జూలై 23: రోడ్డు విస్తరణలో తన ఇల్లు పోతున్నదని ఓ మహిళ తీవ్ర ఆందోళన చెందింది. నోటీసులు వచ్చినప్పటి నుంచి అదే మనోవేదనతో తల్లడిల్లింది. చివరకు గురువారం గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి వరకు ఇటీవల పనులు ప్రారంభించారు.
సుందరగిరిలో 40 ఫీట్ల మేర రోడ్డు విస్తరించాలని గ్రామ ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి తీర్మానం చేశారు. అప్పుడే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లకు మారింగ్ ఇవ్వడంతోపాటు నోటీసులు అందజేశారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న బుర్ర మధురవ్వ (55)కు కూడా నోటీసులు ఇవ్వడంతో ఆందోళన చెందింది. నెల రోజులు గా ఇదే విషయం అందిరికీ చెప్పుకొంటూ బాధపడుతున్నది. గురువారం కూరగాయలు అమ్ముకొని ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ జంగ శిరీష, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి పరామర్శించారు.