న్యూఢిల్లీ : జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌లో విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడులు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కొంతమంది పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులపై దాడి చేశారంటూ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో నిజం కాదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఢిల్లీ పోలీసులకు మద్దతు తెలిపింది. ఆ వీడియో ఫేక్ అని, పోలీసులు మేకులున్న లాఠీలను వాడలేదని తెలిపింది. అయితే ఆల్ట్ న్యూస్ మాత్రం తన కథనంలో ఈ వీడియోలు నిజమే అని పేర్కొంది.
ఛలో సంసద్‌లో పాల్గొన్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు విచక్షణా రహితంగా దాడులు చేశారంటూ అనేక ఆధారాలు బయటకొస్తున్నాయి. గురువారం కొందరు విద్యార్థులు తమపై పెల్లెట్ గన్స్‌తో పోలీసులు దాడి చేశారంటూ చెప్పారు. ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల యువకుడు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. తాను పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్నప్పుడు పోలీసులు తనపై పెల్లెట్ గన్స్ తో దాడి చేసినట్టు తెలిపారు. సఫ్దర్ గంజ్ దవాఖాన నివేదికలు కూడా ఇదే చెప్తున్నాయన్నారు. ఓ 19 ఏండ్ల యువకుడు మాట్లాడుతూ పెల్లెట్ గన్స్ దాడి వల్ల ఒక కన్ను చూపు మందగించినట్టు తెలిపాడు. పెల్లెట్ గన్స్ దాడితో మరో యువకుడు గాయపడ్డట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బయటపెట్టింది. తమతో పాటు మరింత మందిపై ఈ దాడులు జరిగినట్టు వీరు చెబుతున్నారు.