– బీఆర్ఎస్ సర్పంచుల పెండింగ్ బిల్లులు నిలిపివేయడం దారుణం
– తక్షణమే నిధులు మంజూరు చేయాలని సూర్యాపేట కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే బొల్లం, సర్పంచులు, నాయకుల వినతి
కోదాడ, మే 26 : కోదాడ నియోజకవర్గంలో రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల నిధులు నిలిపివేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌కు సర్పంచులు, ఇతర నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సర్పంచ్‌లపై అధికార ప్రభుత్వం రాజకీయ వివక్షతతో నిధులు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, మౌలిక వసతుల పనులకు పెండింగ్ నిధులు మంజూరు చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. గ్రామాల అభివృద్ధికి అత్యవసర బడ్జెట్ కేటాయించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచినప్పటికీ కేవలం రాజకీయ కక్షతో ఆయా గ్రామాలకు మంజూరు కావాల్సిన నిధులను ప్రభుత్వం నిలిపివేయడం దుర్మార్గమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు దాటుతున్నప్పటికీ గ్రామాభివృద్ధిని, గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీధి దీపాలు, ట్రాక్టర్ డీజిల్ వంటి కనీస అవసరాలకే నిధులు లేక పల్లెలు దినావస్థకు చేరుకున్నాయన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను రాజకీయ కారణాలతో ఇబ్బంది పెట్టడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనన్నారు. రాజకీయాలకతీతంగా గత ప్రభుత్వం పల్లెల సమగ్ర అభివృద్ధికి వెలలేని కృషి చేసిందని పేర్కొన్నారు. వివక్ష చూపకుండా తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆయన కలెక్టర్ ను కోరారు. మాజీ ఎమ్మెల్యే వెంట సర్పంచులతో పాటు బీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్ కుమార్, కందిబండ సత్యనారాయణ, బట్టు శివాజీ, తొగరు రమేష్, కోల ఉపేందర్, నర్సిరెడ్డి, శీలం సైదులు, జానకి రామాచారి, భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.