Smart Phone Addiction| ప్రస్తుతం పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ కనిపించడం చాలా సాధారణంగా మారిపోయింది. అయితే పిల్లలు ఫోన్ వైపు ఆకర్షితులు కావడం వాళ్లు అలసత్వంగా ఉండటం వల్ల కాదని తక్షణ వినోదం, వెంటనే దృష్టి మళ్లించే సాధనం, తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్సాహం ఇచ్చే మార్గం కావడంతో స్క్రీన్లకు పిల్లలు త్వరగా అలవాటు పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఈ అలవాటు పెరిగితే నిజ జీవిత ఆటలు, నెమ్మదిగా జరిగే కార్యకలాపాలు పిల్లలకు ఆసక్తికరంగా అనిపించవని నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచేందుకు ఖరీదైన ఆట వస్తువులు అవసరం లేదని, చిన్న చిన్న అలవాట్లే సరిపోతాయని సూచిస్తున్నారు. పిల్లలను ఫోన్ కు దూరంగా ఉంచే కొన్ని అలవాట్ల గురించి వారు వివరిస్తున్నారు.
పిల్లలకు తమ చేతులతో ఏదైనా తయారు చేసే అవకాశం ఇవ్వడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాగితాలు, రంగు పెన్సిళ్లు, మట్టి, కార్డ్బోర్డ్ ముక్కలు లేదా ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే పిల్లలు కొత్త కొత్త వస్తువులు తయారు చేయగలుగుతారు. పేపర్ విమానం, చిన్న ఇల్లు, మట్టి బొమ్మ లేదా బ్లాక్స్‌తో నిర్మాణాలు చేయడం వంటి పనులు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి. ఇలా ఏదైనా స్వయంగా తయారు చేసినప్పుడు వారికి కలిగే ఆనందం స్క్రీన్ల కంటే ఎక్కువకాలం నిలుస్తుంది. పిల్లల్లో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి శారీరక కదలికలు చాలా అవసరం. చిన్న నడక, బంతి ఆటలు, సంగీతానికి డ్యాన్స్ చేయడం లేదా ఇంట్లోనే చిన్న అడ్డంకుల ఆటలు నిర్వహించడం వల్ల పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుంది. శరీరాన్ని కదిలించడం వల్ల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చున్న పిల్లలతో పోలిస్తే పరుగులు తీసిన పిల్లలు మరింత చురుకుగా ఉంటారని పేర్కొంటున్నారు.
ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం కూడా పిల్లలకు ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు సర్దడం, మొక్కలకు నీళ్లు పోయడం, పుస్తకాలు అమర్చడం, టేబుల్ సెట్ చేయడం వంటి పనులు పిల్లల్లో బాధ్యతాభావాన్ని పెంచుతాయి. పెద్దలకు ఇవి చిన్న పనుల్లా అనిపించినా పిల్లలకు మాత్రం తాము కుటుంబంలో భాగమన్న భావన కలుగుతుంది. పిల్లలతో కలిసి చదవడం కూడా మంచి అలవాటుగా చెప్పవచ్చు. కథలు వినిపించడం, పుస్తకాలు కలిసి చదవడం లేదా పిల్లలతో మారుమారుగా చదవించడం వల్ల వారిలో ఊహాశక్తి పెరుగుతుంది. స్క్రీన్లతో పోలిస్తే పుస్తకాలు పిల్లలను ఆలోచింపజేస్తాయని, కథల ప్రపంచంలోకి తీసుకెళ్తాయని నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో పిల్లలను భాగస్వామ్యం చేయడం కూడా మంచి మార్గం. పండ్లు కడగడం, పిండి కలపడం, తేలికపాటి వంట పనుల్లో సహాయం చేయడం వంటి పనులు పిల్లలకు ఆసక్తిని కలిగిస్తాయి. చేతులతో ఏదైనా చేసి చివర్లో తాము తయారీలో భాగమైన ఆహారం చూడటం పిల్లలకు సంతృప్తిని ఇస్తుంది.
ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లడం కూడా పిల్లల్లో మార్పు తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు. పార్కులకు తీసుకెళ్లడం, మొక్కలు నాటించడం, ఆకులు సేకరించడం లేదా పక్షులను గమనించడం వంటి పనులు పిల్లల్లో ప్రశాంతతను పెంచుతాయి. ప్రకృతి పిల్లలను నెమ్మదిగా ఆలోచించేలా చేసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే అలవాటు పెంచుతుంది. పిల్లలతో సరదాగా మాట్లాడటం కూడా ఒక మంచి వినోదంగా మారుతుంది. ఈ రోజు ఏం కొత్తగా చూశావు?, నీకు ఏదైనా కనిపెట్టే అవకాశం వస్తే ఏం కనిపెడతావు? వంటి ప్రశ్నలు అడగడం ద్వారా పిల్లలు తమ ఆలోచనలు పంచుకుంటారు. ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు తాము ముఖ్యమైనవారమన్న భావన పొందడంతో పాటు, ప్రతి సారి వినోదం కోసం స్క్రీన్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.