కాసిపేట : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం(బి) గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ( Voter List ) లో తప్పుల సవరణ ( Correction ) పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders) ఆరోపించారు. తప్పులపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సోమగూడెం బీఆర్ఎస్ నాయకులు కే రాంచందర్ ( Ramchander ) ఓటరు జాబితా తప్పులపై గురువారం వివరాలను వెళ్లడించారు. గతంలో పంచాయతీల్లో పెట్టిన ఓటరు జాబితాలో 43, 44 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అనేక లోపాలున్నాయని ఆరోపించారు. సుమారు 300 మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, డబుల్ ఉన్న వారివి ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయని ఫిర్యాదులు చేశానని గుర్తు చేశారు. దీనిపై సవరణ చేయకుండా పాత జాబితాలనే ఉంచుతున్నారని ఆరోపించారు.
ఓటర్ల జాబితాలో సవరణకు దరఖాస్తులు చేసుకోవాలని ఎన్నికల అధికారులు గురువారం నోటిఫికేషన్ ఇవ్వగా కనీసం సోమగూడెం పంచాయతీలో పాత ఓటరు జాబితా కూడా అందుబాటులో ఉంచలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు సోమగూడెం గ్రామ పంచాయతీలోని పోలింగ్ స్టేషన్ 43, 44 లో ఓటరు జాబితాలపై విచారణ జరిపి తప్పులను సవరణ చేయాలని డిమాండ్ చేశారు.