కాసిపేట : ఈ నెల 25వ తేదీలోపు గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నులు( House Tax) వసూలు చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయాలని బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్ కుమార్( Sateesh Kumar ) ఆదేశించారు.
గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కాసిపేట గ్రామ పంచాయతీని ఆయన పరిశీలించారు. హాజరు యాప్ తనిఖీల్లో భాగంగా ఆయన కాసిపేట గ్రామ పంచాయతీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం సక్రమంగా జరగాలని, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ నిర్వహించి, సిగ్రీగేషన్ షెడ్లో తడి చెత్తను, పొడి చెత్త నుండి వేరు చేసి నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు.
అనంతరం ఆయన వైకుంఠధామాన్ని సందర్శించి, అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. సిగ్రీగేషన్ షెడ్ వద్ద ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శేఖ్సఫ్దర్ అలీ, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.