హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. కార్మిక సంఘాల నేతలు ఈ నెల 26 వరకు ప్రభుత్వానికి, ఆర్టీసీ సంస్థకు డెడ్‌లైన్ విధించారు. అప్పటిలోగా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకపోతే.. మెరుపు సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ లోగా చర్చలకు ఆహ్వానించడంతోపాటు.. సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే.. 26 తర్వాత సమ్మె తేదీని ప్రకటిస్తామని, అప్పటికీ ఎలాంటి జవాబు లేకపోతే కచ్చితంగా మెరుపు సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
తీవ్రమైన పని ఒత్తిడిలో కార్మికులు..
నాడు తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 56 వేల మందికిపైగా కార్మికులు ఉండగా.. ప్రతిరోజూ 30 లక్షల కిలోమీటర్ల వరకు తమ సేవలు అందేవని కార్మికులు అంటున్నారు. సుమారు 18 వేలకు పైగా కార్మికులు రిటైర్ అయినప్పటికీ ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఆ పని భారమంతా ఉన్నవారిపైనే పడుతున్నదని వాపోతున్నారు. దీంతో 8 గంటలు పనిచేయడమే గగనమైన పరిస్థితుల్లో 14 నుండి 16 గంటల వరకు పనిచేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎంపీడబ్ల్యూ యాక్ట్‌కు భిన్నంగా యాజమాన్యం తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నదని ఆరోపిస్తున్నారు. అధిక పని ఒత్తిడిని తట్టుకోలేక కార్మికులు అనారోగ్యం పాలై.. హఠాత్తుగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల సమస్యలు విన్నవించేందుకు కూడా ప్రభుత్వాలు, ఆర్టీసీ యాజమాన్యం సమయం ఇవ్వలేకపోవడంతోనే పరిస్థితి సమ్మె వరకూ వచ్చిందని అంటున్నారు.
అటకెక్కిన ఆర్టీసీ విలీన హామీ
ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ‘ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే రెండు పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాం, వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీజీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం’ అని పేర్కొన్నారు. ఆ హామీకి రెండున్నరేండ్లు గడుస్తున్నా.. దాని అమలుకు ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని కార్మికులు మండిపడుతున్నారు. చిత్తశుద్ధి గురించి రెండేండ్లుగా చెప్తున్న కాంగ్రెస్ నాయకులు.. కేసీఆర్ చేపట్టిన విలీన ప్రక్రియను ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. 2023 అక్టోబర్ 30న అపాయింటెడ్ డే ప్రకటిస్తే.. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఆ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే ఆపుతున్నదని ఆరోపిస్తున్నారు. అపాయింటెడ్ డే కోసం వేలాది మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు.
ఆర్టీసీలో ఎక్కడి సమస్యలు అక్కడే..
2017 నుంచి వేతన సవరణలు అమలుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎరియర్స్ అన్నీ లెక్కగట్టి గతంలో ఇచ్చినట్టు ఐదేండ్ల కాలపరిమితికి వడ్డీ సహా చెల్లించాలని కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండానే.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏ కట్ చేస్తున్నారని వాపోతున్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ప్రతినెల కుప్పలుకుప్పలుగా పేరుకుపోతున్నాయని, దీంతో సంస్థపై మరింత భారం పడుతున్నదని పేర్కొంటున్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఆర్టీసీలో ప్రైవేటీకరణ ప్రారంభమైందని అంటున్నారు. ఇప్పటికే ఆ బస్‌లకు ప్రైవేట్ డ్రైవర్లను తీసుకుంటున్నారని, డిపోలను ఆక్రమిస్తున్నారని, చార్జింగ్పాయింట్ల పేరుతో ఆర్టీసీ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో తమను ఉద్యోగ భద్రత కల్పించాలని కోరడం మినహా.. మరో దారి కనిపించడం లేదని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపకట్టకపోతే.. సమ్మెలో పాల్గొంటామని హెచ్చరిస్తున్నారు.