వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఇండియన్-కొరియన్ నేపథ్యాలతో క్రాస్ కల్చరల్ బ్లెండ్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇందులో వరుణ్‌తేజ్ మునుపెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో కనిపిస్తారని మేకర్స్ అంటున్నారు. తాజాగా దక్షిణ కొరియాలో ఈ సినిమా చివరి షెడ్యూల్ మొదలైంది.
వారం రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. సౌత్ కొరియాలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతామని, ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది. రితికా నాయక్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాణం: యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: మేర్లపాక గాంధీ.
రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. పాటలు మొదలు ప్రచార చిత్రాలు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ని సృష్టించాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్ని ఆటల్లో ప్రవేశం కలిగిన ఆటకూలీ పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఓ వైపు ‘పెద్ది’ ప్రీరిలీజ్ మానియా కొనసాగుతుండగానే..మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ చేయనున్న తదుపరి సినిమా అప్డేట్ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సుకుమార్-రామ్‌చరణ్ కాంబోలో ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ రావడంతో తాజా ప్రాజెక్ట్‌పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్ పుట్టినరోజైన ఈ నెల 27న ఈ సినిమా తాలూకు బిగ్ అప్డేట్ వెలువడనుందట. సినిమా కాన్సెప్ట్‌తో పాటు ప్రీలుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ క్లాస్, మాస్ జోనర్లో రెండు స్క్రిప్ట్‌లు సిద్ధం చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. మరి వీటిలో ఆయన దేనిని ఎంచుకుంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మొత్తానికి రామ్‌చరణ్ బర్త్‌డే రోజున ఈ క్రేజీ ప్రాజెక్ట్ బిగ్ అప్డేట్ ఖాయమని అంటున్నారు.
‘బేబీ జాన్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచినా ఈ భామ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా కీర్తి సురేష్ బాలీవుడ్లో మరో బంపరాఫర్‌ను దక్కించుకుంది. రాజ్‌కుమార్ రావుతో కలిసి ఆమె ‘రాఫ్తార్’ అనే చిత్రంలో నటించనుంది. ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనున్నారు. శనివారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది.
షూటింగ్ ప్రారంభించామని, జూలైలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, ప్రేమకథకు కూడా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్లో కనిపిస్తుందని, బాలీవుడ్లో ఆమె కెరీర్‌కు బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో నటిస్తున్నది.
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పోలీస్ యాక్షన్ డ్రామా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. పవర్ఫుల్ యాక్షన్, పంచ్ డైలాగ్‌లు, చక్కటి వినోదంతో ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకుంది.
పవన్‌కల్యాణ్ తన ట్రేడ్ మార్క్ మేనరిజం, డైలాగ్స్‌తో అదరగొట్టాడు. ‘సంతోషంగా ఉండటం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం.. మన జీవితానికి ఎవడెవడో లైక్‌లు కొట్టడం కాదు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్…ఇచ్చిపడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం’, ‘ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది..’ అంటూ పవన్‌కల్యాణ్ చెప్పిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. మాస్, కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్గా కలబోసి దర్శకుడు ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. శ్రీలీల, రాశీఖన్నా, పార్థిబన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నేపథ్య సంగీతం: తమన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీశ్‌శంకర్ ఎస్.
ఇప్పుడు సినీ నిర్మాణం అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. కొత్త ఆర్టిస్టులతో ఓ చిన్న సినిమా తీయాలన్నా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సిందే. అలాంటిది కేవలం 33 వేలతో సినిమా తీసి చూపించారు బాలీవుడ్ దర్శకుడు రాహి అనిల్ బార్వీ. ఈ బడ్జెట్‌తో షార్ట్‌ఫిల్మ్ తీయడం కష్టతరమైన నేటి పరిస్థితుల్లో ఆయన ఏకంగా ఫీచర్ ఫిల్మ్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాహి అనిల్ బార్వీ ఎవరో కాదు..‘తుంబాడ్’ వంటి మిస్టరీ థ్రిల్లర్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన. ఇప్పుడు ‘మన్-పిశాచ్’ పేరుతో కేవలం ఇద్దరు నటులతో ఆయన ప్రయోగం చేశారు. ఈ సైకలాజికల్ హారర్ డ్రామాను యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే అనే ఇద్దరు నటులతో 80 నిమిషాల నిడివితో తెరకెక్కించారు. ‘మన్-పిశాచ్’ స్క్రిప్ట్ 60 పేజీలు. ఈ సినిమా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు. చేతితో గీసిన స్టోరీ బోర్డులు, ఐఫోన్లో తీసిన వీడియో రికార్డింగ్స్, ఫొటోషాప్, జనరేటివ్ ఏఐ ఉపయోగించిన ఈ సినిమాను పూర్తి చేశారు.
పురావస్తు శాఖకు చెందిన అధికారి సదాశివరావ్..హడమ్గాన్ అనే ఒక ఊరికి వెళతాడు. కొండలోంచి బయటపడ్డ పెద్ద గుమ్మటం రహస్యం తెలుసుకునేందుకు పరిశోధన మొదలుపెడతాడు. అక్కడ సావిత్రి అనే వితంతువు ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. రాత్రి కాగానే ఆ గ్రామంలో చోటుచేసుకునే భయానక అనుభవాలే ‘మన్-పిశాచ్’ కథ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం 33 వేలతో ఆ స్థాయి క్వాలిటీతో సినిమా తీయడం అద్భుతమని ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో కృతిమ మేధ (ఏఐ) సినిమా నిర్మాణాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెబుతున్నారు. పట్టుదల, తపన ఉంటే ఓ కళాకారుడు శూన్యం నుంచి కూడా అద్భుతాలు సృష్టించగలడని, అందుకు ఈ సినిమా ప్రయోగమే సాక్ష్యమని దర్శకుడు అనిల్ బార్వీ తెలిపారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేయబోతున్నారు.
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్‌చంద్ర దర్శకుడు. రెడ్పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ముమ్మరం చేశారు. శుక్రవారం ఈ సినిమా నుంచి మూడో పాట ‘బంగారు బొమ్మ’ను విడుదల చేశారు. నాగవంశీ స్వరపరచిన ఈ గీతాన్ని బాలాజీ రచించారు. వింటేజ్ ఫీల్‌తో సాగిన ఈ పాట ప్రేమికుల మదిలోని మధురభావాలను ఆవిష్కరించింది. ప్రేయసిని ‘బంగారు బొమ్మ’ అని పిలిచే కథానాయకుడు ఆమెపై ఉన్న అనురాగాన్ని ఈ పాట ద్వారా వ్యక్తం చేశారు. జగపతిబాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నాగవంశీకృష్ణ, నిర్మాత: అభినవ్ రావు, రచన-దర్శకత్వం: సుభాష్‌చంద్ర.