జహీరాబాద్, మార్చి 14: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో శనివారం పోలీస్ పహారాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. జహీరాబాద్ భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లలోడ్తో శనివారం గ్రామానికి చేరుకున్నారు. ఆన్లైన్ యాప్లో బుకింగ్ కాకపోవడంతో గ్రామానికి వచ్చిన వాహనం దగ్గరికి వినియోగదారులు చేరుకుని గ్యాస్ సిలిండర్ల కోసం ఎగబడ్డారు.
ముందుగానే బుక్ చేసుకున్నవారికి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఏజెన్సీ సిబ్బంది చెప్పినా వినియోగదారులు పట్టించుకోలేదు. దాదాపు మూడు గంటల పాటు గ్యాస్ సిలిండర్లు ఎవరికీ ఇవ్వకుండా ఏజెన్సీ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీస్ సిబ్బంది గ్రామానికి చేరుకుని వరుస క్రమంలో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.