ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో సామాన్య ప్రజలు ఎలాంటి అవస్థల పాలవుతున్నారో తెలుగు తెలిసిన వారందరి దృష్టికి ప్రముఖంగా తీసుకువచ్చిన తొలితరం తెలంగాణ రచయితల్లో వట్టికోట ఆళ్వారుస్వామి ప్రముఖులు. ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో భండారు అచ్చమాంబ, కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఒద్దిరాజు సోదరులు తదితరులు ఈ కృషికి ఒరవడి దిద్దారు.
వట్టికోట, పల్లా దుర్గయ్య, బి.రామరాజు, కాళోజీ సోదరులు, దాశరథి, సి.నారాయణరెడ్డి, గూడూరి సీతారాం, నెల్లూరి కేశవస్వామి తదితరుల కృషి దీనికి కొనసాగింపే. మిగతా వారికి, వట్టికోట ఆళ్వారుస్వామికీ తేడా ఏమిటంటే.. వారంతా మధ్యతరగతి-అంతకన్నా పై వరుసలో ఉన్న వర్గాలకు చెందినవారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు. ఆళ్వారుస్వామి అలా కాదు! ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు. బాల్యంలోనే అతని తండ్రి పోవడంతో, పెద్ద చదువులు చదివే భాగ్యం ఆయనకు దక్కలేదు. చదువుకునే తాపత్రయంతో వట్టికోట బాల్యంలోనే తన గురువు ఇంట్లో వంటవాడిగా మారారు. ఆ రోజుల్లో పల్లెలపై పెత్తనాన్ని నడిపిస్తున్న చిల్లరదేవుళ్లు ఆళ్వారుస్వామిపై కన్నెర్రజేశారు. దాంతో ఆళ్వారుస్వామి చిన్నవయసులోనే ఊరొదిలి పోవాల్సి వచ్చింది.
అలాంటి వ్యక్తిత్వం దాశరథి కృష్ణమాచార్య లాంటి యువ కవిని ఆకర్షించి, ప్రభావితం చేయడంలో వింతేమున్నది? అందుకే, ఆళ్వారుస్వామిని ‘పదమూడో ఆళ్వారు’గా సంభావిస్తూ ఆయనకే తన ‘అగ్నిధార’ కవితా సంకలనాన్ని అంకితమిచ్చారు. వైష్ణవ మత సంప్రదాయంలో ‘పన్నిద్దరాళ్వార్లు’ సుప్రసిద్ధులు.
ఈ పన్నెండుమంది ఆళ్వార్లలో రాజులు ఉన్నారు, రైతులూ ఉన్నారు, ‘అంటరానివారు’గా ముద్రపడిన కులాల్లో పుట్టినవారూ ఉన్నారు. ఈ ఆళ్వార్లు పాడిన భక్తిగీతాల సంపుటాన్ని ‘నాలాయిర దివ్యప్రబంధం’ అంటారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి హోటల్ కార్మికునిగా అవతారమెత్తారు ఆళ్వారుస్వామి. ఇంగ్లిష్, ఉర్దూ భాషా-సాహిత్యాలు నేర్చుకుని రచయితగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమంతో ప్రభావితుడై మొదట్లో కొరియర్గా పనిచేశారు. ‘మీజాన్’లాంటి తెలుగుపత్రికల్లో పనిచేసే పాత్రికేయ మిత్రులకు ఉద్యమ వార్తలను చేరవేసేవారు. ఆ పరిచయాల సహాయంతోనే తెలుగు ‘మీజాన్’లో స్వచ్ఛంద విలేకరిగా పాత్రికేయ జీవితం మొదలుపెట్టారు. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడే ‘గోల్కొండ పత్రిక’తో స్వయంగా తానే పత్రికా రచయితగా మారారు.
1946లో దొడ్డి కొమురయ్యను విసునూరు దొరల కిరాయిగూండాలు కడవెండి గ్రామంలో హతమార్చినప్పుడు, వట్టికోట పౌరహక్కుల పరిరక్షణకు నడుంకట్టారు. హైదరాబాద్ నగరానికి వచ్చి, పద్మజానాయుడు నేతృత్వంలో నిజనిర్ధారణ సంఘాన్ని కడవెండికి తీసుకెళ్లింది వట్టికోటే. ఈ వార్త తెలుగు ‘మీజాన్’ ద్వారా తెలంగాణ ప్రజలకు చేరడం వెనుక కూడా ఆళ్వారుస్వామి ప్రయత్నం ఉన్న సంగతి చరిత్రకెక్కినదే! స్వతంత్ర భారత దేశంలో భాగం కావడానికి అంగీకరించని నిజాం వైఖరిని నిరసిస్తూ సత్యాగ్రహానికి దిగాలని స్వామి రామానందతీర్థ 1947లో పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు స్పందించిన సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లారు.
ఆళ్వారుస్వామి నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నపుడు అప్పట్లో తనకు ఎదురైన అనుభవాల ఆధారంగానే, ‘జైలు లోపల’ అనే కథాసంపుటిని 1952లో వెలువరించారు. మిత్రుల సహకారంతో ‘దేశోద్ధ్ధారక గ్రంథమాల’ లాంటి సంస్థలను నెలకొల్పి నిలబెట్టారు. తెలంగాణ రచయితల సంఘం స్థాపించిన వారిలో ఆళ్వారుస్వామి ముఖ్యులు. బతికింది నాలుగున్నర దశాబ్దాలే అయినప్పటికీ తన చేతి మీదుగా 35 పుస్తకాలు ప్రచురింపజేశారు ఆళ్వారుస్వామి. అత్మకథాత్మకమైన నవలలు ‘ప్రజల మనిషి’, ‘గంగు’ను ఆయన రచించారు.
ఆళ్వారుస్వామి కథానికల్లో క్లుప్తతతో పాటు గాఢత-గహనత కూడా సాంద్రంగా ఉంటాయి. ఆళ్వారుస్వామి. పాతికేండ్ల యువకుడిని ఓ జైల్లో చట్టబద్ధంగా హత్య చేస్తారు. (చట్టబద్ధంగా చేసే హత్యకు ముద్దుపేరే ఉరిశిక్ష!) తద్వారా, తమ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించామని బోరవిరుచుకొని చెప్తారు పోలీస్ అధికారులు. ఓ గజదొంగ వాళ్లను నిలదీయడమే ‘పతితుని హృదయం’ కథానిక ఇతివృత్తం. ఇది, 1952లో వెలువడిన ‘జైలు లోపల’ కథా సంపుటం లోనిది.
ప్రభుత్వం నుంచి భారీ జీతాలు పొందే పోలీస్ అధికారులు నిశ్చింతగా (చట్టబద్ధంగానే అయినా) ఖూనీలు చెయ్యడంలో ధర్మం ఏముందన్నదని గండయ్య వాదన. అర్థవంతమైన ఈ నైతిక సమస్యను లేవనెత్తిన గండయ్యకు ఒంటికొట్టు ఖైదు విధిస్తారు.
‘అభ్యుదయ’ మాసపత్రికలో, 1956లో అచ్చయిన మరో కథానిక ‘గాలిపటం’. ప్రేమ పేరిట యువతులను మోసం చేసే కామపిశాచులను నమ్మి, దారితప్పి బజారుపాలైన యువతి వైనమే ఈ కథానిక ఇతివృత్తం. ‘అత్యంత పురాతనమైన వృత్తి’గా చెప్పుకునే వేశ్యావృత్తికి ఇలాంటి సులభ పరిష్కారాలు సాధ్యమే. అయితే, ఇప్పటికీ ఆ సమస్య అపరిష్కృతంగా ఎందుకు ఉండిపోతుంది?