భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 2 : మహిళా సాధికారత కోసం స్వశక్తి మహిళా సంఘాలకు తెలంగాణ పేదరిక నిర్మూల సంస్థ(సెర్ఫ్) ద్వారా అనేక రకాల రుణ సదుపాయం కల్పిస్తోంది. శ్రీనిధి బ్యాంకు నుంచి రుణాలను పొందే అవకాశం కల్పిస్తోంది. స్వశక్తి మహిళా పొదుపు సంఘాలు తీసుకున్న వివిధ రకాల రుణాలను సద్వినియోగం చేసుకొని తిరిగి అప్పు చెల్లిస్తూ ఎంతోమంది స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరి కొందరికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా భరోసా కల్పించాల్సిన రిసోర్స్ పర్సన్(ఆర్పీ), వీవోఏ, మహిళా సంఘాల సహాయకులు అవినీతికి పాల్పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సెర్ఫ్ ద్వారా మహిళా సంఘాలకు అందాల్సిన బ్యాంకు రుణాలు దకకుండా మోకాలడ్డుతున్నారని ఆరోపణలున్నాయి. బ్యాంకు లింకేజీ శ్రీనిధి, పొదుపు రుణాల మంజూరులో ఆర్పీలు, వీవోఏలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సంఘాలను అడ్డం పెట్టుకొని వేలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
రుణాలను పొందేందుకు రూపొందించిన నిబంధనల్లోని లొసుగులు, రుణాలపై సభ్యులకు సంపూర్ణ అవగాహన లేకపోవడంతో ఆర్పీలు, వీఏవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మండలంలో 822 మహిళా సంఘాలు, మున్సిపాలిటీలో 410 మహిళా (పొదుపు) సంఘాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 12 మంది రిసోర్స్పర్సన్స్, మండల స్థాయిలో 36 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవో ఏ) పని చేస్తున్నారు. మహిళా సంఘాలను ఏర్పాటు చేసి.. పొదుపు చేసిన అనంతరం రుణాలు ఇప్పించడం వీరి బాధ్యత.
మున్సిపాలిటీ, మండలంలో మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చాక కొందరు డబ్బులు అడుగుతున్నారని, ఒక లక్ష రూపాయలకు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ముకు పిండి జలగల్లా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్ని లక్షల రూపాయలు ఇస్తే అన్ని వేల రూపాయలు కమీషన్ తీసుకుంటున్నారని, డబ్బు ఇవ్వకపోతే సతాయించడం, నెలకు ఒక్కో సంఘం వద్ద బుకులు రాసినందుకు రూ.300 చెల్లిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘం మీటింగ్కు చెప్పిన టైంకి రాకపోతే లోన్ తీర్మానం బుకులో రాయడం లేదని, ఆర్పీ, వీవోఏల దగ్గర బుకులు ఉంచుకోవడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు.
కొందరు లీడర్లు ఆర్పీ, వీబీకేలతో కుమ్మక్కు కావడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారా? అప్పులు తిరిగి చెల్లిస్తున్నారా? నిబంధనల మేరకు సంఘాలను పర్యవేక్షిస్తున్నారా? అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ, గ్రామాల్లోని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన చదువురాని మహిళలకు అవగాహన లేకపోవడంతో వారిని మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.