ప్యాంగ్యాంగ్, మార్చి14: పశ్చిమాసియాలో యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ మరో టెన్షన్ మొదలైంది. ఉత్తర కొరియా శనివారం జపాన్ సముద్ర జలాల్లోకి 10 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించింది. జపాన్ సముద్ర జలాల్లో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు సమాధానంగా..ఉత్తర కొరియా ఈ చర్యకు దిగినట్టు వార్తలు వెలువడ్డాయి.
శనివారం తమ దేశ సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా వరుసగా 10 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని, జపాన్ ఆర్థిక మండలి వెలుపల ఒక మిస్సైల్ పడిపోయినట్టు ఆ దేశ ప్రభుత్వ మీడియా ‘ఎన్‌హెచ్‌కే’ పేర్కొన్నది. తమ దేశ తూర్పు తీర సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగించినట్టు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటనలో తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు పూర్తిగా రక్షణాత్మకమైనవిగా చెబుతున్నప్పటికీ, ఈ చర్యలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండిస్తున్నది.