Harish Rao | హైదరాబాద్ : సిగాచి బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం హామీ ఏమైంది..? అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. నాలుగు నెలలు గడిచినా సిగాచి బాధితులకు పరిహారం అందకపోవడంతో.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఇచ్చింది 26 లక్షలే.. ప్రభుత్వం బాకీ పడింది 74 లక్షలు.. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదా? అని హరీశ్ రావు నిలదీశారు.
కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు నిస్సిగ్గుగా “బాధితులకు రూ. 40 నుండి 50 లక్షలు అందించాం” అని ప్రకటించడం అత్యంత శోచనీయం. చికిత్స ఖర్చులను పరిహారంలో కోత విధించడం అమానవీయం. ఆచూకీ దొరకని 8 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం దుర్మార్గం. సిగాచి యాజమాన్యానికి అధికారులు ఏజెంట్లుగా మారారు. బాధితులను చీదరించుకోవడం దారుణం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేంద్రం ప్రకటించిన రూ. 2 లక్షలు ఇప్పించే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? హైకోర్టు మొట్టికాయలు వేసినా యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? తక్షణమే కోటి పరిహారం చెల్లించాలి.. లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తాం అని హరీశ్ రావు హెచ్చరించారు. పరిహారం కోసం బాధితుల చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. పాలకుల మనసు కరగడం లేదు. సిట్ (SIT) వేయరు.. అరెస్టులు చేయరు.. నిస్సిగ్గుగా సిగాచి యాజమాన్యాన్ని కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గారికి,
విషయం: సిగాచి ప్రమాద బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇప్పటికీ అందలేదు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి న్యాయం చేయాలని కోరుతూ బహిరంగ లేఖ.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని “సిగాచి” పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి, నాలుగు నెలలు గడిచింది. 54 మంది కార్మికులను పొట్టనపెట్టుకున్న నాటి దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతున్నది. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులు నడి రోడ్డున పడి కన్నీరు మున్నీరవుతున్నాయి. ఒకవైపు అయిన వారిని కోల్పోయి, మరోవైపు ప్రభుత్వ సాయం అందక గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆనాడు ప్రమాద స్థలానికి వచ్చి, మృతదేహాల సాక్షిగా మీరు ఇచ్చిన హామి ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం శోచనీయం. పైగా పరిహారం అందించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుంటే ఇక ఆ బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి. సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో మీరు, మీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.
ప్రమాదం జరిగిన జూన్ 30న మీరు స్వయంగా వచ్చి, మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని ఘనంగా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు. కానీ నిజానికి ఏం జరిగింది? పరిహారాన్ని పరిహాసంగా మార్చారు. నాలుగు నెలలు గడిచినా పరిహారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. వాస్తవం ఏమిటంటే గడిచిన నాలుగు నెలల్లో బాధితుల చేతికి అందింది కేవలం రూ. 26 లక్షలు మాత్రమే (కంపెనీ ఇచ్చిన రూ. 25 లక్షలు + ప్రభుత్వ తరపున ఇచ్చిన రూ. లక్ష). ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి ఇంకా రూ. 74 లక్షలు బాకీ పడ్డారు. ఇది మాట తప్పడం కాదా?
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు నిస్సిగ్గుగా “బాధితులకు రూ. 40 నుండి 50 లక్షలు అందించాం” అని ప్రకటించడం అత్యంత శోచనీయం. కార్మికులకు రావాల్సిన పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI), ఇన్సూరెన్స్ డబ్బులను కూడా మీరు ఇప్పించే నష్టపరిహారంలో కలిపి లెక్కలు చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. అది వారి హక్కు. అది మీ భిక్ష కాదు. ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పడం దుర్మార్గం. అంతేకాక, చికిత్స పొందుతూ చనిపోయిన వారి ఖర్చులను కూడా పరిహారంలో కలిపి చూపడం మీ అమానవీయ పాలనకు అద్దం పడుతోంది. చావులో కూడా రాజకీయం చూసుకునే దుర్మార్గ సంస్కృతికి తెరతీశారు. గాయపడ్డ కార్మికులు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటుంటే పట్టించుకునే నాథుడే లేడు.
ప్రమాదంలో కాలి బూడిదై, ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాల రోదనలు మీకు వినిపించడం లేదా? ఈ 8 మంది సిబ్బంది ప్రమాదం జరిగిన రోజు విధులకు హాజరైనట్టు సీసీ టీవీ ఫుటేజీలు, బయోమెట్రిక్ ఆధారాలు ఉన్నప్పటికీ, వారికి కనీసం డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. 3 నెలల్లో సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పిన అధికారులు, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ లేక ఆ కుటుంబాలకు బీమా డబ్బులు రాక, పరిహారం అందక నరకం అనుభవిస్తున్నారు. నిబంధనల పేరు చెప్పి, ఆచూకి దొరకని వారిని మృతులుగా పరిగణించడానికి 7 ఏళ్లు వేచి చూడమనడం మానవత్వం అనిపించుకుంటుందా? మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఇప్పటికీ బాధితులకు అందలేదు. కేంద్రంతో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?
ఇంత పెద్ద ప్రమాదం జరిగితే యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సాక్షాత్తు హైకోర్టు మీ ప్రభుత్వాన్ని నిలదీసినా మీలో చలనం లేదు. సిట్ (SIT) విచారణ జరిపించాలని డిమాండ్ ఉన్నా పట్టించుకోరు. దర్యాప్తు పేరిట కాలయాపన చేస్తూ, యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?
ముఖ్యమంత్రి గారూ.. మీ హామీని నమ్మి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మిక కుటుంబాలు మూడు నెలలు ఇక్కడే పడిగాపులు కాసారు. పరిహారం ఇక రాదేమోనని నిరాశ చెంది, కన్నీళ్లతో తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. వలస కార్మికుల పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గౌరవాన్ని చూపారు. కరోనా విపత్తు వేళ రైళ్లు ఏర్పాటు చేసి సొంత రాష్ట్రాలకు పంపారు. తెలంగాణ అభివృద్దిలో వారూ భాగస్వాములేనని, వారు చేస్తున్న కృషిని అనేక సార్లు ప్రశంసించారు. కానీ మీరు మాత్రం వలస కార్మికుల మరణాలను కూడా రాజకీయంగా వాడుకున్నారు. అంతేగాని వారికి ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చలేదు. పరిహారం మాట దేవుడెరుగు, చివరకు డెత్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇక్కడే స్థానికంగా ఉన్న మన తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధిత కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
కన్నవారిని, కట్టుకున్నవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం, పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ, పరిశ్రమ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. తిరిగి తిరిగి వారి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప, పాలకుల మనసు కరగడం లేదు. న్యాయం చేయమని అడిగితే పరిశ్రమ వద్ద ఉన్న ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది వారిని ఆదరించాల్సింది పోయి..ఈసడించుకుంటున్నారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు.. అంతా యాజమాన్యం దయ.. వాళ్లు చెబితేనే మేం చేస్తాం.. మాకు ఎలాంటి సమాచారం లేదు’ అంటూ కసురుకుంటున్నారు. అయినవారిని కోల్పోయిన ఆవేదనలో ఉన్న వారిని ఓదార్చాల్సింది పోయి, విసుక్కుంటూ చీదరించుకోవడం దుర్మార్గం.
ముఖ్యమంత్రి గారు.. ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే మీకు 54 కుటుంబాల కన్నీటి వేదన మీకు కనిపించడం లేదా. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి, ప్రభుత్వమే వారిని మరింత దుఃఖంలోకి నెట్టివేయడం అత్యంత అమానవీయం. ప్రమాదం జరిగినప్పుడు మీరు హడావిడిగా వచ్చి చూపించిన సానుభూతి కేవలం ప్రచారం కోసమేనా? బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వమే, నేడు యాజమాన్యానికి కొమ్ముకాస్తూ పారిశ్రామికవేత్తల చేతుల్లో కీలు బొమ్మలా మారడం తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టండి, మొద్రు నిద్ర వీడండి. ఇచ్చిన హామీ ప్రకారం పరిహారం అందించి సిగాచి బాధితుల కన్నీళ్లు తుడవండి. లేదంటే ఆ కుటుంబాల ఉసురు మీకు, మీ ప్రభుత్వానికి తగలకమానదు.
ఇట్లు
తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే