న్యూఢిల్లీ, మార్చి 17: గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికమవడంతో కిలో వెండి ఏకంగా రూ.6 వేలు (2.34 శాతం) పెరిగి రూ.2,62,500కి చేరుకున్నది. అలాగే బంగారం కూడా మరో వెయ్యి రూపాయలు పెరిగింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,050 లేదా ఒక్క శాతం అధికమై రూ.1,61,300 పలికింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడం వల్లనే వీటి ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ రీసర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. రూపాయి పతనం, చమురు ధరలు భగ్గుమనడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 5 వేల డాలర్ల స్థాయిలో కదలాడుతుండగా, వెండి 80.46 డాలర్లుగా ఉన్నది.