కాంగ్రెస్ సర్కారుపై సబ్బండ వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడంపై పోరుబాట పడుతున్నారు. ఎన్నికల హామీలను ఇంకెప్పుడు అమలుచేస్తారంటూ నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించపోయినా, హామీలు అమలుచేయకపోయినా గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్మికులు, కర్షకులు ఆందోళనలకు దిగారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా తమకిచ్చిన హామీలను ఎందుకు అమలుచేయడంలేదంటూ ప్రశ్నించారు. నెలల తరబడి పెండింగ్ పెడుతూ అప్పుడో ఇప్పుడో ఇస్తున్న చాలీచాలని వేతనాలతో కుటుంబాలను ఎలా బతికించుకోవాలని కార్మికులు, పంటల పెట్టుబడి కోసం ఇస్తామన్న రైతుభరోసాను ఒకే దఫాలో ఇవ్వాలని కర్షకులు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
కలెక్టరేట్ల ఎదుట ఆశ కార్యకర్తలు..
ఖమ్మం కమాన్‌బజార్/ కొత్తగూడెం గణేష్టెంపుల్, మార్చి 17: శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఎన్హెచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్ల ఎదుట మంగళవారం ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కార్యదర్శి తుమ్మ విష్ణువర్ధన్, భద్రాద్రి జిల్లా జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారిలు మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి ఆశ కార్యకర్తలు ప్రజలకు సేవలు అందిస్తున్నారని, వారిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇన్నేళ్లుగా సేవలు అందిస్తున్నా వారికి ఎలాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు, ఫిక్స్డ్ వేతనాలు లేవన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచలేదని, రూ.50 లక్షల బీమా వర్తింపజేయలేదన్నారు. అలాగే పీఆర్సీ, ఎరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియా, ఎన్నికల విధులకు సంబంధించిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి తోడు వేతనాలు కూడా నెలనెలా రావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్లో వీరికి తగిన విధంగా కేటాయింపులు చేపట్టాలని వారు. డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్ కార్యాలయాల్లో అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో సంఘం నాయకులు మోహన్‌రావు, శ్రీను, అమల, రమణ, మంగమ్మ, నాగమణి, కమల, రాణి, సుధ, జ్యోతి, పద్మ, రవికుమార్, సుశీల, రుక్మిణి, హైమ, విజయలక్ష్మి, సుజాత పాల్గొన్నారు.
ఐడీవోసీ ఎదుట అన్నదాతలు..
పాల్వంచ, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం యాసంగికి సంబంధించి రైతుభరోసా డబ్బులు ఏకకాలంలో చెల్లించాలని, రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) నాయకులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమ ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుభరోసా డబ్బులు విడతలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులు పండించిన మొక్కజొన్న, ఎర్రజొన్న తదితర పంటలకు కనీస మద్దతు ధర అమలు చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం, నాయకులు అమర్లపూడి రాము, బానోత్ ధర్మ, మాచర్ల సత్యం, జాటోత్ కృష్ణ, బైరు వెంకటేశ్వర్లు, బానోత్ వీరు, బాలు, శత్రు, వీరస్వామి, రమణి, సరోజ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఈఎస్ఐ డిస్పెన్సరీ ఎదుట కార్మికులు
బూర్గంపహాడ్, మార్చి 17: ఈఎస్ఐ డిస్పెన్సరీలో 24 గంటలపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా చూడాలని కోరుతూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సారపాకలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్ సానికొమ్ము రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ డిస్పెన్సరీలో మందులు పూర్తిస్థాయిలో లేకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన అంబులెన్స్ లేకపోవడం దారుణమన్నారు. తక్షణమే సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి డిస్పెన్సరీలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మిక సంఘాల సభ్యులు ఉర్లగొండ వీరన్న, కందాల వెంకటరెడ్డి, జగదీశ్, సీహెచ్.ఆంజనేయులు, కె.నాగయ్య, చుక్కపల్లి బాలాజీ, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
జీపీ కార్మికుల ముందస్తు అరెస్టు
వేంసూరు, మార్చి 17: సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్ వద్ద తలపెట్టిన గ్రామపంచాయతీ కార్మికుల మహా ధర్నాకు వెళ్లకుండా కార్మికులను వేంసూరు పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సుధాకర్, సుందరం, కుమారస్వామి, రాము, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.