బడంగ్పేట్,మార్చి17: బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవక తవకల పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన మరుసటి రోజే డీఈ వెంకన్నపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్నను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో డీఈగా హరిణికి బాధ్యతలు అప్పగించారు. డీఈ వెంకన్న ను మలక్ పేట్‌కు బదిలీ చేయడంతో బుధవారం రిలీవ్ కానున్నారు. బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవక తవకలకు కారణమైన అసలైన అధికారులపై వేటు వేయకుండా డీఈపై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.
మరో ఇద్దరు అధికారులపై వేటు వేయనున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారుల విచారణ పూర్తికాక ముందే డీఈని బదిలీ చేయడం పై జోరుగా చర్చ సాగుతోంది. అసలు అవినీతికి పాల్పడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో నని అధికార వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండదండలు ఉన్న అధికారుల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని చర్చించుకుంటున్నారు. అవినీతికి బీజాలు వేసిన అధికారులను ఎందుకు వదిలి పెడుతున్నారోనన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా ఎంత మందిపై చర్యలు తీసుకుంటారో చూడాల్సింది.