హైదరాబాద్,మార్చి 17 (నమస్తే తెలంగాణ) : సభలో అధికారపక్షానికి చెం దిన సభ్యులు మాట్లాడుతుంటే మేము అడ్డుపడలేదు. వాళ్లు మాట్లాడుతుంటే అడ్డుతగిలి తప్పులు చెప్పలేదు. కానీ, మా సభ్యులు మాట్లాడే సమయంలో మంత్రులు, అధికార పార్టీకి చెందిన సభ్యులు పదేపదే అడ్డుపడుతున్నారు. ఇదెక్కడి న్యాయం? అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. కేటీఆర్ స్పీచ్ మొదలుపెట్టి అధికారపక్షాన్ని ఎండగడుతున్న క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డుతగలడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన తలసాని, జోక్యం చేసుకొని స్పీకర్ అందరివాడులా ఉండాలని సూచించారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే అధికార సభ్యులు ప్రతిసారి మధ్యలో అడ్డుతగులుతున్నారని, దీంతో సభామర్యాదలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సభలో మాట్లాడం తమ హక్కు అని తెలిపారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే రాసుకొని, రిప్లయ్ ఇచ్చేటప్పుడు మాట్లాడాలని సూచించారు. సభలో తాము అనని మాటలను ముఖ్యమంత్రి సీరియస్‌గా చెప్పడంతో, తాము బయటికి వెళ్లినట్టు స్పష్టంచేశారు. స్పీకర్ ఈ విషయంలో కలుగజేసుకొని ప్రతిపక్షాల హక్కులను కాపాడాలని కోరారు.