ఖమ్మం రూరల్, నవంబర్ 20 : గ్రానైట్ వ్యర్ధాలను ప్రధాన రహదారుల వెంట పారబోస్తే జరిమానా తప్పదని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు కమిషనర్ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు రహదారుల వెంట గత కొంతకాలంగా కొందరు గ్రానైట్ యజమానులు రహదారుల వెంట భారీ వాహనాలతో వ్యర్థాలను తీసుకువచ్చి పడవేయడం జరుగుతుందన్నారు. దీంతో అటువైపుగా ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురౌతున్నట్లు తెలిపారు.
ఈ విషయం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇకనుంచి రహదారుల వెంట గ్రానైట్ వ్యర్ధాలను పడవేసే వారికి అక్షరాల రూ.10 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. కావున గ్రానైట్ క్వారీ యజమానులు ఈ విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేనియెడల మున్సిపల్ శాఖ తీసుకునే చర్యలకు బాధ్యులవుతారన్నారు.