మంచిర్యాల అర్బన్ : మంచిర్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నాలుగు నెలల బాలుడు ( Boy ) చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు.
జగిత్యాల జిల్లాకు చెందిన పాలపు శేఖర్( Shekar ) , సౌందర్య ( Soundarya) దంపతులకు కార్తీక్ (4) బాబు ఉన్నాడు. నాలుగు నెలల క్రితం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్కు వచ్చారు. రెండు రోజుల క్రితం బాబుకు శ్వాసకు సంబంధించిన సమస్య (Breathing problem) రావడంతో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో ఉన్న రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రికి తీసుకోవచ్చారు.
ఆసుపత్రి వైద్యుడు బాబును పరిశీలించి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని రెండు రోజుల పాటు చికిత్సను అందించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి బాబుకు కార్డియక్ సమస్య రావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా చికిత్స అందించే విషయంలో వైద్యుడు నిర్లక్ష్యం చేయడంతో బాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
వైద్యుడు నిర్లక్ష్యం వలనే తమ చిన్నారి మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుమారుడు మృతికి కారణమైన వైద్యుడు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ఆసుపత్రి వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు.
చికిత్స సమయంలో కార్డియా సమస్యతో మృతి : డాక్టర్ సతీష్ కుమార్
ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యుడు సతీష్ కుమార్ ను వివరణ కోరగా ఈ నెల 18న శ్వాస సమస్యతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని , తాను సరైన వైద్యం అందించినట్లు తెలిపారు. బుధవారం రాత్రి తల్లి బాబుకు పాలు పట్టిస్తున్న సమయంలో గుండెకు సంబంధించి హిడెన్ (Hidden Health Issue ) అనే సమస్య వచ్చిందని, వెంటనే ప్రథమ చికిత్సను అందించానని వివరించారు.
మెరుగైన వైద్య చికిత్స కోసం కరీంనగర్, హైదరాబాద్ కార్డియాలిజిస్ట్ వద్దకు వెళ్లాలని సూచించానని వెల్లడించారు. అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆలస్యం చేయడంతో బాబు మృతి చెందాడని వైద్యుడు వివరించారు.