Vikarabad | హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య, పిల్లలను చంపిన కేసులో నిందితుడికి కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. 2019లో భార్య, ఇద్దరు పిల్లలను ప్రవీణ్ అనే వ్యక్తి చంపాడు. భార్య, పిల్లల హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ప్రవీణే భార్య, పిల్లలను చంపాడని రుజువు కావడంతో కోర్టు ఉరిశిక్ష విధించింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రవీణ్ కుమార్(32) వృత్తిరీత్యా ప్రయివేటు ఉద్యోగి. వికారాబాద్‌లో భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉండేవాడు. భార్య చాందినీకి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు. ఐదేండ్ల కుమార్తె ఇన్జిల్ను, తొమ్మిదేళ్ల కుమారుడు అయాన్ కూడా హతమార్చాడు. అయితే చాందిని ప్రవీణ్‌కు రెండో భార్య. కాగా కుమారుడు అయాన్ చాందినికి మొదటి భర్త సంతానం. ఇన్జిల్ మాత్రం ప్రవీణ్ కూతురే.
ఇక భార్య చాందిని మొబైల్లో సందేశాలు చూసి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. తరుచూ మద్యం సేవించి భార్యతో గొడవపడేవాడని దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే భార్యాపిల్లలను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే వారిని హత్య చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు. నేరం తీవ్రత, ఆధారాలను పరిశీలించిన వికారాబాద్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.