సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : విద్యుత్‌శాఖలో ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, డిప్యూటీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్న వైనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం రేపుతుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంతో పాటు ఎస్పీడీసీఎల్లో ఈ కథనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు డాక్యుమెంట్‌పై డిజిటల్ సంతకాలు ఉన్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవి ఎలా ఫోర్జరీ జరిగాయనే దిశగా ఉన్నతాధికారులు ఆరా తీశారు. తాము డ్రాయింగ్ అప్రూవల్స్ ఇస్తేనే కనెక్షన్లు .. ఇవ్వాల్సిన విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లతో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుకుంటూ నకిలీ అప్రూవల్స్కు కనెక్షన్లు ఇచ్చినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. అయితే ఇవి ఎంత మంది కాంట్రాక్టర్లు చేశారు.. ఎప్పటినుంచి చేశారనే కోణంలో సీఈఐజీ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.
ఎనిమిది నెలలుగా ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు. అందులో బహుళ అంతస్తుల భవనాలు ఎన్ని, పరిశ్రమలు, మల్టీ కాంప్లెక్స్‌లు ఇతర వివరాలను కోరుతూ టీజీఎస్పీడీసీఎల్కు సీఈఐజీ లేఖ రాయనున్నట్లు తెలిసింది. దీని వెనుక ఎవరున్నారనే కోణంలో కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడారు. ఈ ఫోర్జరీ వ్యవహారంలో కీలక పాత్రధారులైన ఇద్దరు కాంట్రాక్టర్లను సీఈఐజీ పిలిచి అసలు ఎందుకు ఇలా చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. తమకేం తెలియదని చెప్పినప్పటికీ వారు తీసుకున్న అప్రూవల్స్కు సంబంధించి క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తే వివరాలు రావడం లేదని, ఇది ఎలా జరిగిందంటూ సీఈఐజీ నందకుమార్ ప్రశ్నించారు. దీనికి వారు ఎలాంటి సమాధానమివ్వలేదని తెలిసింది. తనిఖీల అధికారి కార్యాలయం నుంచి అప్రూవల్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ దక్షిణ డిస్కంకు చెందిన కొందరు డీఈ, ఏడీఈ, ఏఈలు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై అడ్డగోలుగా కనెక్షన్లు ఇచ్చారని తెలుస్తోంది.
నమస్తే తెలంగాణలో వచ్చిన కథనంపై మింట్‌కాంపౌండ్‌లోని డిస్కం ప్రధాన కార్యాలయంలో చర్చ జరిగింది. కాంట్రాక్టర్లు కనెక్షన్లు కావాలంటూ దరఖాస్తు చేసుకుంటే నానాతిప్పులు పెడుతూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్న అధికారులు కొందరు ఈ వ్యవహారంలో తమకు నచ్చిన కాంట్రాక్టర్ల నుంచి తనిఖీఅధికారి డిజిటల్ సంతకంతో వచ్చిన నకిలీ ధ్రువీకరణలను అనుమతిస్తూ వారికి కనెక్షన్లు ఇబ్బడిముబ్బడిగా ఇచ్చారని విచారణలో తేలినట్లు సమాచారం. ఈ అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఈఐజీ నందకుమార్ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌కు సిఫారసు చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కాంట్రాక్టర్ల విషయంలో ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు. వచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లతో ఇలా ఎందుకు చేశారని, నకిలీలకు కార్యాలయంలో ఎవరు సహకరించారని అడగగా వారు నోరు మెదపలేదు.
తాము రాకముందు జరిగిన ఈ బాగోతానికి సూత్రధారులెవరనే కోణంలో విచారించినట్లు సమాచారం. అయితే తామేమైనా డబ్బులడిగామా.. ఎందుకు ఇలా ఫోర్జరీ లెటర్లు పెట్టడం.. ఇలా చేస్తే వినియోగదారులకు నష్టం జరుగుతుంది కదా అంటూ సీఈఐజీ నందకుమార్ ఆ కాంట్రాక్టర్లను తీవ్రంగా మందలించారు. ఇదే సమయంలో సీఈఐజీ కార్యాలయంకు చెందిన ఒక ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సహకారంతో ఈ బాగోతమంతా నడిచిందని, ఆయనపై గతంలో అనేక ఆరోపణలు వచ్చినా తనకున్న రాజకీయ అండదండలతో కార్యాలయాన్ని నడిపిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. ఈ నకిలీ లెటర్లు తయారు చేసిన కాంట్రాక్టర్లు ఆ అధికారితో కలిసి కార్యాలయ సిబ్బంది సహకారంతో , ఎస్పీడీసీఎల్ ఇంజినీర్లతో కుమ్ముక్కై మొత్తం వ్యవహారాన్ని నడిపించారని దక్షిణడిస్కం ప్రధానకార్యాలయంలో అధికారుల మధ్య గుసగుసలు వినిపించాయి.
మా కార్యాలయ అధికారుల డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేయడం ఆశ్చర్యమనిపించింది. లోతుగా విచారణ జరుపుతున్నాం. మేం బాధ్యతలు తీసుకోవడానికి ముందే ఇలా జరిగినట్లుగా తెలిసింది. అదే విషయంపై ఇప్పటికే కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడాం. వారి నుంచి కొన్ని వివరాలు సేకరించాం. అయితే డిజిటల్ సంతకం ఎలా ఫోర్జరీ చేస్తారనే విషయంలో కొన్ని అనుమానాలున్నప్పటికీ అసలు అప్రూవల్స్ నకిలీవి కావడంతో వాటిని ఎస్పీడీసీఎల్ అధికారులు ఎలా ఒప్పుకున్నారనే విషయంపై చర్చిస్తున్నాం.బాధ్యులైపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
-నందకుమార్,సీఈఐజీ