న్యూఢిల్లీ, నవంబర్ 21 : డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ ఉత్పత్తులను నియంత్రించే ఆలోచనేదీ తమకు లేదని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం స్పష్టం చేసింది. అది మా పరిధిలోకి రాదని, అందుకే దాన్ని రెగ్యులేట్ చేయాలని చూడటం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. రీట్స్, ఇన్విట్స్-2025పై ఇక్కడ జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన సందర్భంగా పాండే మాట్లాడుతూ.. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అందుబాటులో ఉండే ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) లేదా ట్రేడింగ్ అయ్యే ఇతర గోల్డ్ సెక్యూరిటీల ద్వారా జరిగే బంగారం సంబంధిత పెట్టుబడులను మాత్రమే సెబీ రెగ్యులేట్ చేస్తుందని చెప్పారు. సెబీ నియంత్రణలోకి డిజిటల్ గోల్డ్ వేదికలనూ తీసుకురావాలని ఇటీవల డిజిటల్ గోల్డ్ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడిది ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. నిజానికి ఈ నెల ఆరంభంలో డిజిటల్ లేదా ఈ-గోల్డ్ ప్రొడక్ట్స్‌లో పెట్టుబడులపట్ల మదుపరులను సెబీ హెచ్చరించింది. అలాంటి పెట్టుబడులపై నియంత్రణేదీ ఉండదని, ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నది.
కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో సెబీ పైవిధంగా జాగ్రత్తల్ని సూచించింది. ఈ రకమైన డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్స్.. సెబీ నియంత్రణలోని గోల్డ్ ప్రొడక్ట్స్‌తో పోల్చితే భిన్నంగా ఉంటాయని, అవి అటు రెగ్యులేటెడ్ కమోడిటీ డెరివేటివ్‌లు, గుర్తింపు పొందిన సెక్యూరిటీలు ఏవీ గుర్తించనివని తెలిపింది. అందుకే వీటిలో పెట్టుబడులు రిస్క్ అన్నది. ఈ క్రమంలోనే డిజిటల్ గోల్డ్ ఇండస్ట్రీ.. సెబీ రెగ్యులేషన్‌ను కోరింది. కానీ పాండే ప్రకటనతో అది జరుగబోదని తేలిపోయింది. కాగా, ఇటీవల భౌతిక బంగారం కంటే డిజిటల్ గోల్డ్‌పైనే అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రం సైతం ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా యువ మదుపరులు వీటిని కొనేందుకు, వీటిపై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇదే అదనుగా భావిస్తున్న అక్రమార్కులు.. మోసాలకు తెగబడుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు అటు ఆర్బీఐ, ఇటు సెబీ మదుపరులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి.
ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్లలో పాల్గొనకుండా మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ను సెబీ నిషేధించింది. యాంకర్ రౌండ్లలో పెట్టుబడులు పెట్టేందుకే అనుమతించింది. ఈ మేరకు సెబీ వర్గాలు తాజాగా తెలియజేశాయి. కంపెనీ వాల్యుయేషన్‌లో పారదర్శకతను పెంచడానికి ఇది దోహదం చేయగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. వచ్చే నెల 17న జరిగే బోర్డు సమావేశంలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్ల నిబంధనలను సమగ్ర రీతిలో సమీక్షించాలని సెబీ చూస్తున్నది. మరింత ప్రభావవంతంగా వీటిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు సమాచారం.